IPL 2026: రాయల్స్‌ హీరోకు షాకిచ్చిన క్రికెట్‌ సౌతాఫ్రికా | Coetzee, Burger, Miller, Van der Dussen lose CSA contracts | Sakshi
Sakshi News home page

IPL 2026: రాయల్స్‌ హీరోకు షాకిచ్చిన క్రికెట్‌ సౌతాఫ్రికా

Apr 1 2026 4:48 PM | Updated on Apr 1 2026 5:03 PM

Coetzee, Burger, Miller, Van der Dussen lose CSA contracts

రాజస్థాన్‌ రాయల్స్‌ స్టార్‌ బౌలర్‌ నండ్రే బర్గర్‌కు అతని సొంత దేశ క్రికెట్‌ బోర్డు (CSA) షాకిచ్చింది. తాజాగా ప్రకటించిన వార్షిక కాంట్రాక్ట్‌ల (2026–27 ) జాబితా నుంచి అతని పేరును తప్పించింది. బర్గర్‌తో పాటు మరికొంత మంది స్టార్‌ ఆటగాళ్లు కూడా ఈ జాబితా నుంచి తప్పించబడ్డారు. గెరాల్డ్‌ కొయెట్జీ, లిజాడ్‌‌ విలియమ్స్‌, డేవిడ్‌ మిల్లర్‌, రాసీ వాన్‌ డర్‌ డస్సెన్‌ లాంటి స్టార్లు కాంట్రాక్టులు కోల్పోయారు.

కాంట్రాక్ట్‌ల విషయంలో క్రికెట్‌ సౌతాఫ్రికా ముందు నుంచి ఓ విషయం చెప్పుకుంటూ వచ్చింది. ఆటగాళ్లు ఎన్ని ప్రైవేట్‌ లీగ్‌ల్లో పాల్గొన్నా, జాతీయ జట్టు తరఫున వీలైనన్ని మ్యాచ్‌లు ఆడాలని కండీషన్‌ పెట్టింది. అయినా, చాలామంది ఆటగాళ్లు ప్రైవేట్‌ లీగ్‌లకే అధిక ప్రాధాన్యమిచ్చి జాతీయ విధులను నిర్లక్ష్యం చేశాడు. దీని ఫలితమే తాజాగా ప్రకటించిన వార్షిక కాంట్రాక్ట్‌ల జాబితాలో స్టార్‌ ప్లేయర్లకు చోటు దక్కకపోవడం​.

తాజాగా కాంట్రాక్ట్‌ కోల్పోయిన ఆటగాళ్లు ప్రైవేట్‌ లీగ్‌ల్లో ఆడటం వల్ల గాయాలపాలై జాతీయ జట్టు తరఫున ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేకపోయారు. అందుకే వీరిని కాంట్రాక్ట్‌ జాబితా నుంచి తప్పించినట్లు క్రికెట్‌ సౌతాఫ్రికా వివరణ ఇచ్చింది. సౌతాఫ్రికా జట్టు గతేడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు 53 మ్యాచ్‌లు (7 టెస్టులు, 12 వన్డేలు, 34 టీ20లు) ఆడగా.. కొయెట్జీ 8 (టీ20లు), బర్గర్‌ 15 (9 వన్డేలు, 6 టీ20లు), విలియమ్స్‌ 6 (ఒక వన్డే, 5 టీ20లు) మ్యాచ్‌లు మాత్రమే ఆడారు.

మిలర్‌ (36), డస్సెన్‌ (37) వయసు పైబడుతున్న కారణంగా కాంట్రాక్ట్‌లు కోల్పోయారు. అయితే ఆశ్చర్యకరంగా మరో వెటరన్‌ సైమన్‌ హార్మర్‌కు (37) కాంట్రాక్ట్‌ దక్కింది. ఈసారి కొత్తగా కాంట్రాక్ట్‌లు పొందిన ఆటగాళ్ల జాబితాలో ఓట్నీల్‌ బార్ట్‌మన్‌, కార్బిన్‌ బాష్‌, మాథ్యూ బ్రీట్జ్కే, డెవాల్డ్‌ బ్రెవిస్‌ తదితరులు ఉన్నారు.

వార్షిక కాంట్రాక్ట్‌ పొందిన ఆటగాళ్ల జాబితా..
టెంబా బవుమా, డేవిడ్ బెడింగ్‌హామ్, ఒట్నీల్ బార్ట్‌మన్, కార్బిన్ బాష్, మాథ్యూ బ్రీట్జ్‌కే, డెవాల్డ్ బ్రీవిస్, టోనీ డి జోర్జి, మార్కో జాన్‌సెన్, కేశవ్ మహరాజ్, క్వేనా మఫాకా, ఐడెన్ మార్క్‌రామ్, వియాన్ ముల్డర్, సెనురన్ ముత్తుసామి, లుంగి ఎంగిడి, కగిసో రబాడ, ర్యాన్‌ రికెల్టన్‌, ట్రిస్టన్‌ స్టబ్స్‌, కైల్‌ వెర్రిన్‌, సైమన్ హార్మర్

రాయల్స్‌ హీరోగా మారిన బర్గర్‌  
ఐపీఎల్‌ 2026లో భాగంగా తాజాగా సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌తో నండ్రే బర్గర్‌ చెలరేగిపోయాడు. కీలకమైన సంజూ శాంసన్‌ వికెట్‌ సహా పొదుపుగా బౌలింగ్‌ చేసి, ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌తో బర్గర్‌ రాయల్స్‌ హీరోగా ఇమేజ్‌ తెచ్చుకున్నాడు. అతను సంజూ వికెట్‌ తీసిన తీరు రాయల్స్‌ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. 

Advertisement
 
Advertisement
Advertisement