
లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానం వేదికగా రేపటి నుంచి (జులై 31) టీమిండియాతో ప్రారంభం కాబోయే ఐదో టెస్ట్‌కు ముందు ఇంగ్లండ్ జట్టుకు అతి భారీ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్, ఇన్ ఫామ్ ప్లేయర్ బెన్ స్టోక్స్ భుజం గాయం కారణంగా కీలకమైన మ్యాచ్‌కు దూరమయ్యాడు.
స్టోక్స్ మాంచెస్టర్‌లో జరిగిన నాలుగో టెస్ట్‌లో ఏకంగా 35 ఓవర్లు వేసి గాయాన్ని కొని తెచ్చుకున్నాడు. ఆ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాటర్లు వీరోచితంగా పోరాడుతున్న సమయంలోనే స్టోక్స్ చాలా అసౌకర్యంగా కనిపించాడు. అప్పుడే అతని పని అయిపోయిందని అంతా అనుకున్నారు.
నాలుగో టెస్ట్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు ఐదుకు పైగా సెషన్లలో ఏకంగా 143 ఓవర్లు బ్యాటింగ్ చేసి ఇంగ్లండ్ బౌలర్ల రసాన్ని పీల్చారు. స్టోక్స్ దాని బాదితుడే. ఆ మ్యాచ్‌లో స్టోక్స్ బంతితో పాటు బ్యాట్‌తోనూ చెలరేగి (5 వికెట్ల ప్రదర్శన సహా 6 వికెట్లు, సెంచరీ) ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.
అంతకుముందు వారు గెలిచిన మూడో టెస్ట్‌లోనూ స్టోక్సే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. ఆ మ్యాచ్‌లో అతను 77 పరుగులు చేసి, 5 వికెట్లు తీశాడు. ఈ సిరీస్‌లో లీడింగ్ వికెట్ టేకర్‌గా (17 వికెట్లు) నిలవడంతో పాటు బ్యాట్‌తోనూ మంచి టచ్‌లో ఉన్న స్టోక్స్ కీలకమైన ఐదో టెస్ట్‌కు దూరం కావడం ఇంగ్లండ్ విజయావకాశాలను తప్పక ప్రభావితం చేస్తుంది.
కెప్టెన్‌గా పోప్
స్టోక్స్ గైర్హాజరీలో ఐదో టెస్ట్‌లో ఇంగ్లండ్ కెప్టెన్‌గా ఓలీ పోప్ వ్యవహరించనున్నాడు. ఈ మేరకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటన విడుదల చేసింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ తుది జట్టును కూడా ప్రకటించింది. ఇందులో ఏకంగా నాలుగు మార్పులు చేసింది.
గాయపడిన స్టోక్స్ స్థానంలో జేమీ ఓవర్టన్ తుది జట్టులోకి రాగా.. జోఫ్రా ఆర్చర్, బ్రైడన్ కార్స్, లియామ్ డాసన్ స్థానాల్లో జేకబ్ బేతెల్, గస్ అట్కిన్సన్, జోష్ టంగ్‌లకు తుది జట్టులో స్థానం కల్పించింది. జేకబ్ బేతెల్ ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడని స్పష్టం చేసింది.
కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ ప్రస్తుతం 1-2తో వెనుకపడి ఉంది. ఇందులో 1,3 మ్యాచ్‌లు ఇంగ్లండ్ గెలువగా.. భారత్ రెండో మ్యాచ్‌లో విజయం సాధించింది. నాలుగో టెస్ట్ డ్రాగా ముగిసింది. ఐదో టెస్ట్‌లో భారత్ విజయం సాధిస్తే సిరీస్ సమం అవుతుంది. ఓడినా, డ్రా అయినా ఇంగ్లండ్ వశమవుతుంది. ఇలాంటి కీలక మ్యాచ్‌లో ఇన్ ఫామ్ ఆల్‌రౌండర్ స్టోక్స్ లేకపోవడం భారత్‌కు తప్పక కలిసొచ్చే విషయమే.