
వింబుల్డన్ టోర్నీ సెమీస్‌లో బెలారస్ స్టార్
2 గంటల 54 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్ ఫైనల్లో విజయం
లండన్: ఈ ఏడాది వరుసగా మూడో గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్ చేరేందుకు బెలారస్ స్టార్ సబలెంకా మరో విజయం దూరంలో నిలిచింది. ఈ సంవత్సరం ఆ్రస్టేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో ఫైనల్‌కు చేరి రన్నరప్‌తో సరిపెట్టుకున్న సబలెంకా... అదే జోరును వింబుల్డన్ టోర్నీలోనూ కొనసాగించి ఈ టోర్నీలో మూడోసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సబలెంకా 4–6, 6–2, 6–4తో ప్రపంచ 104వ ర్యాంకర్ లౌరా సిగెముండ్ (జర్మనీ)పై కష్టపడి గెలిచింది.
2 గంటల 54 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సబలెంకాకు 37 ఏళ్ల సిగెముండ్ నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురైంది. క్వార్టర్ ఫైనల్ చేరే క్రమంలో ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోని సబలెంకా ఈ మ్యాచ్‌లో తొలి సెట్‌ను చేజార్చుకుంది. అయితే రెండో సెట్‌లో తేరుకున్న సబలెంకా మూడుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసింది. సెట్‌ను 6–2తో దక్కించుకొని మ్యాచ్‌లో నిలిచింది. మూడో సెట్‌లో ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. చివరకు పదో గేమ్‌లో సిగెముండ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన సబలెంకా విజయాన్ని ఖరారు చేసుకుంది.
మ్యాచ్ మొత్తంలో రెండు ఏస్‌లు సంధించిన సబలెంకా నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. నెట్ వద్దకు 43 సార్లు దూసుకొచ్చి 25 సార్లు పాయింట్లు గెలిచింది. 29 విన్నర్స్ కొట్టిన ఈ బెలారస్ స్టార్ 36 అనవసర తప్పిదాలు చేసింది. తన సర్వీస్‌ను ఆరుసార్లు కోల్పోయి ప్రత్యర్థి సర్వీస్‌ను ఎనిమిదిసార్లు బ్రేక్ చేసింది. 2021, 2023లలో వింబుల్డన్‌లో సెమీఫైనల్ చేరి ఓడిపోయిన సబలెంకా రేపు జరిగే సెమీఫైనల్లో అనిసిమోవాతో ఆడుతుంది.
తొలిసారి సెమీస్‌లో అనిసిమోవా
నాలుగోసారి వింబుల్డన్ టోర్నీలో ఆడుతున్న ప్రపంచ 12వ ర్యాంకర్ అనిసిమోవా (అమెరికా) తొలిసారి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. క్వార్టర్ ఫైనల్లో అనిసిమోవా 6–1, 7–6 (11/9)తో పావ్లీచెంకోవా (రష్యా)పై నెగ్గింది. 22వసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడిన అనిసిమోవా 2019లో ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీఫైనల్‌కు చేరుకుంది.
అల్‌కరాజ్ అలవోకగా...
పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ అల్‌కరాజ్ (స్పెయిన్) వరుసగా మూడో ఏడాది సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. కామెరాన్ నోరి (బ్రిటన్)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో అల్‌కరాజ్ 6–2, 6–3, 6–3తో గెలుపొందాడు. 99 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అల్‌కరాజ్ 13 ఏస్‌లు సంధించి ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు. సెమీఫైనల్లో అమెరికా ప్లేయర్, ప్రపంచ ఐదో ర్యాంకర్ టేలర్ ఫ్రిట్జ్‌తో అల్‌కరాజ్ తలపడతాడు. మరో క్వార్టర్ ఫైనల్లో ఫ్రిట్జ్ 6–3, 6–4, 1–6, 7–6 (7/4)తో ఖచనోవ్ (రష్యా)పై గెలిచి తన కెరీర్‌లో తొలిసారి వింబుల్డన్‌లో సెమీఫైనల్‌కు చేరాడు.
గట్టెక్కిన సినెర్
సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ యానిక్ సినెర్ (ఇటలీ) కి అదృష్టం కలిసొచ్చింది. దిమిత్రోవ్ (బల్గేరియా) తో జరిగిన మ్యాచ్‌లో సినెర్ తొలి రెండు సెట్‌లను 3–6, 5–7తో కోల్పోయాడు. మూడో సెట్‌లో స్కోరు 2–2తో సమంగా ఉన్నపుడు దిమిత్రోవ్ గాయపడ్డాడు. దాంతో దిమిత్రోవ్ ఆటను కొనసాగించలేకపోవడంతో సినెర్‌ను విజేతగా ప్రకటించారు. గత ఐదు గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో దిమిత్రోవ్ గాయాల కారణంగా వైదొలగడం గమనార్హం.