
70 ఏళ్లు పూర్తి చేసుకున్న బీసీసీఐ అధ్యక్షుడు
నిబంధనల ప్రకారం వైదొలగాలి
ఆశలు రేపుతున్న కొత్త క్రీడాబిల్లు
న్యూఢిల్లీ: మాజీ క్రికెటర్, ప్రస్తుత భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు రోజర్ బిన్నీ శనివారం (19 జూలై) నాటి పుట్టినరోజుతో 70 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఇప్పుడున్న జాతీయ క్రీడా నియమావళి (స్పోర్ట్స్ కోడ్) ప్రకారం ఏవరైనా క్రీడా సమాఖ్య కార్యవర్గ సభ్యుడు గరిష్టంగా 70 ఏళ్ల వయసు వరకే పదవిలో కొనసాగాలి. వయోపరిమితి మించితే వైదొలగాల్సి ఉంటుంది.
అయితే బీసీసీఐ ఒక స్వతంత్ర క్రీడా సంఘమైనా... మిగతా జాతీయ క్రీడా సమాఖ్యల మాదిరి భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) గొడుగు కింద లేకపోయినా... లాస్‌ఏంజెలిస్ ఒలింపిక్స్ (2028)లో క్రికెట్ ఉండటంతో ఇకపై స్పోర్ట్స్ కోడ్ ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇటీవల మీడియాలో ఆయన తప్పుకుంటారని, తాత్కాలిక అధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా బాధ్యతలు చేపడతారని వార్తలు ప్రముఖంగా వచ్చాయి. దీంతో అతను తప్పుకోవడంపై నేడో రేపో ప్రకటన ఉండొచ్చనే ఊహాగానాలు కూడా వినిపించాయి. కానీ బిన్నీ నుంచి అలాంటి ప్రకటన కాదు కదా... కనీసం సంకేతాలు కూడా రాలేదు.
కొత్త ‘కోడ్’పై కోటి ఆశలు
రోజర్ బిన్నీ పదవిని వీడకపోవడానికి కారణం కూడా లేకపోలేదు. త్వరలోనే కేంద్ర ప్రభుత్వం నూతన క్రీడా బిల్లును ప్రవేశపెట్టబోతోంది. దీనికి సంబంధించిన ముసాయిదా ఎప్పుడో సిద్ధమైంది. ఈ శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంట్ ముందుకు ఈ బిల్లు రానుంది. ఇందులో ఉన్న కొత్త నిబంధన వృద్ధండ పిండాలకు ఊరటనిచ్చేలా ఉంది. గరిష్ట వయోపరిమితికి వెసులుబాటు కల్పిస్తుంది.
అంటే నామినేషన్ల సమయంలో 69 ఏళ్లకు పైబడి 70 ఏళ్లలోపు ఏ ఒక్కరోజు మిగిలున్నా... అలాంటి సందర్భంలో ఆ వ్యక్తి పోటీపడేందుకు... గెలిస్తే పూర్తి పదవీకాలం కొనసాగేందుకు కొత్త క్రీడా పాలసీలో అవకాశం ఉంది. దీంతో ఈ బిల్లు పాస్ అయితే 70 ఏళ్ల నుంచి 75 ఏళ్ల వరకు బిన్నీలాంటివారు పదవిలో కొనసాగవచ్చు.
పైగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ), అంతర్జాతీయ ఫుట్‌బాల్ సంఘాల సమాఖ్య (ఫిపా), అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)లో గరిష్ట వయోపరిమితి లేనేలేదు. ఒకవేళ విమర్శలు ఎదురైతే రాజీవ్ శుక్లాకు తాత్కాలిక బాధ్యతలు అప్పగించడం లేదంటే స్పోర్ట్స్ కోడ్ బిల్లు వరకు వేచి చూసే ధోరణితో ఉండాలని బీసీసీఐ వర్గాలు భావిస్తున్నాయి.