పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ పొట్టి క్రికెట్‌లో చారిత్రక మైలురాయిని తాకాడు. ఈ ఫార్మాట్‌లో 100 అర్ద సెంచరీల (341 ఇన్నింగ్స్‌ల్లో) అత్యంత అరుదైన ఫీట్‌ను సాధించాడు. పొట్టి క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు కేవలం ముగ్గురు మాత్రమే ఈ ఘనత సాధించారు. వీరిలో డేవిడ్ వార్నర్ (117) అగ్రస్థానంలో ఉండగా.. విరాట్ కోహ్లి (107), జోస్ బట్లర్ (100) ఆతర్వాతి స్థానాల్లో ఉన్నారు. తాజాగా బాబర్ వీరి సరసన చేరాడు.
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026లో భాగంగా క్వెట్టా గ్లాడియేటర్స్‌తో నిన్న (ఏప్రిల్ 15) జరిగిన మ్యాచ్‌లో బాబర్ 100 హాఫ్ సెంచరీల ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో అతను 51 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో అజేయమైన 71 పరుగులు చేసి తన జట్టు (పెషావర్ జల్మీ) విజయంలోనూ ప్రధానపాత్ర పోషించాడు. పాక్ తరఫున సెంచరీ హాఫ్ సెంచరీలు చేసిన మొదటి ప్లేయర్‌గా బాబర్ చరిత్రకెక్కాడు.
తన టీ20 కెరీర్‌లో ఇప్పటివరకు 341 ఇన్నింగ్స్‌లు ఆడిన బాబర్ 100 హాఫ్ సెంచరీలతో పాటు 11 సెంచరీలు కూడా చేశాడు. తద్వారా పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక 50 ప్లస్ స్కోర్లు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో వార్నర్ (126), విరాట్ (116) మాత్రమే బాబర్ (111) కంటే ముందున్నారు.
బాబర్ టీ20 గణాంకాలు
- 341 ఇన్నింగ్స్‌ల్లో 12,206 పరుగులు
- సగటు – 42.38
- స్ట్రైక్ రేట్ – 128.41
- 100 ఫిఫ్టీలు, 11 సెంచరీలు
ఇటీవలే బాబర్ పీఎస్‌ఎల్‌లోనూ ఓ చారిత్రక ఘనత సాధించాడు. ఈ లీగ్‌లో 4000 పరుగులు పూర్తి చేసిన తొలి ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. పీఎస్‌ఎల్‌లో 106 మ్యాచ్‌లు ఆడిన బాబర్ 127.86 స్ట్రయిక్‌రేట్‌తో 45.98 సగటున 4093 పరుగులు చేశాడు.
పీఎస్‌ఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో బాబర్ తర్వాతి స్థానాల్లో ఫకర్ జమాన్ (3039), మహ్మద్ రిజ్వాన్ (2853), రిలీ రొస్సో (2392), షోయబ్ మాలిక్ (2350) ఉన్నారు.


