
రావల్పిండి వేదికగా పాకిస్తాన్, సౌతాఫ్రికా జట్ల మధ్య ఇవాళ (అక్టోబర్ 20) రెండో టెస్ట్ మ్యాచ్ (Pakistan vs South Africa) మొదలైంది. ఈ మ్యాచ్ తొలి రోజు ఆట బ్యాలెన్స్‌గా సాగింది. ఇరు జట్లు ఆధిపత్యం విషయంలో సమంగా నిలిచాయి. ఓ సెషన్‌లో పాక్ ఆధిపత్యం సాధిస్తే.. మరో సెషన్‌లో సౌతాఫ్రికా ఆధిక్యత ప్రదర్శించింది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. స్టార్ ఆటగాళ్లు బాబర్ ఆజమ్ (16), మహ్మద్ రిజ్వాన్ (19) విఫలమైనా.. కెప్టెన్ షాన్ మసూద్ (87), ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (57) అర్ద సెంచరీలతో తమ జట్టును ఆదుకున్నారు. సౌద్ షకీల్ (42), సల్మాన్ అఘా (10) క్రీజ్‌లో ఉన్నారు.
పాకిస్తాన్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 17 పరుగులు చేసిన ఇమామ్ ఉల్ హాక్‌ను 35 పరుగుల వద్దే సైమన్ హార్మర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆతర్వాత అబ్దుల్లా షఫీక్, షాన్ మసూద్ (Shan Masood) పాక్ ఇన్నింగ్స్‌ను నిర్మించారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 111 పరుగులు జోడించారు.
ఆతర్వాత హార్మర్ పాక్‌కు మరో స్ట్రోక్ ఇచ్చాడు. 146 పరుగుల వద్ద షఫీక్‌ను ఔట్ చేశాడు. ఈ దశలో ఎప్పటిలాగే భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన బాబర్ ఆజమ్ (Babar Azam) వరుస బౌండరీలతో అలరించాడు.
16 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బాబర్‌ను కేశవ్ మహారాజ్ దెబ్బేశాడు. కేశవ్ బౌలింగ్‌లో టోనీ డి జోర్జీకి క్యాచ్ ఇచ్చి బాబర్ పెవిలియన్‌కు చేరాడు. ఆతర్వాత షాన్ మసూద్.. సౌద్ షకీల్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 45 పరుగులు జోడించి ఔటయ్యాడు. సెంచరీకి 13 పరుగుల ముందు మసూద్‌ను కేశవ్ మహారాజ్ ఔట్ చేశాడు.
ఆతర్వాత వచ్చిన మరో పాక్ స్టార్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ 19 పరుగులు చేసి రబాడ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. రిజ్వాన్ వికెట్ పడ్డాక జాగ్రత్తగా ఆడిన పాకిస్తాన్ మరో వికెట్ కోల్పోకుండా తొలి రోజు ఆట ముగించింది.
కాగా, రెండు టెస్ట్‌లు, మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌ల కోసం సౌతాఫ్రికా జట్టు పాక్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా జరిగిన తొలి టెస్ట్‌లో పాక్ 93 పరుగుల తేడాతో పర్యాటక జట్టుపై విజయం సాధించింది.