
స్వదేశంలో జింబాబ్వేతో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో (Zimbabwe Vs Afghanistan) జింబాబ్వే యువ పేసర్ బ్రాడ్ ఈవాన్స్ (Brad Evans) చెలరేగిపోయాడు. 9.3 ఓవర్లలో 22 పరుగుల మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీశాడు. ఈవాన్స్‌కు బ్లెస్సింగ్ ముజరబానీ (11-1-4-3), తనక చివంగ (6-0-29-1) కూడా తోడవ్వడంతో జింబాబ్వే ఆఫ్ఘనిస్తాన్‌ను 127 పరుగులకే ఆలౌట్ చేసింది.
ఇవాళే మొదలైన (అక్టోబర్ 20) ఈ మ్యాచ్‌లో జింబాబ్వే టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఆదిలో ఆఫ్ఘనిస్తాన్ గౌరవప్రదమైన స్కోర్ సాధించేలా కనిపించింది. అయితే బ్రాడ్ ఈవాన్స్ ఒక్కసారిగా చెలరేగడంతో ఆఫ్ఘనిస్తాన్ స్వల్ప స్కోర్‌కే కుప్పకూలింది. ఈవాన్స్ తన కెరీర్‌లో రెండో టెస్ట్‌లోనే ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేయడం విశేషం.
ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో 37 పరుగులు చేసిన రహ్మానుల్లా గుర్భాజ్ టాప్ స్కోరర్ కాగా.. అబ్దుల్ మాలిక్ (30), ఇబ్రహీం జద్రాన్ (19), బషీర్ షా (12), అహ్మద్జాయ్ (10 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేయగలిగారు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన జింబాబ్వే కూడా ఆదిలోనే వికెట్ కోల్పోయింది. 6 పరుగులకే ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్‌ను జియా ఉర్ రెహ్మాన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. బెన్ కర్రన్ (2), నిక్ వెల్చ్ బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు.
కాగా, ఏకైక టెస్ట్ మ్యాచ్, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టు జింబాబ్వేలో పర్యటిస్తుంది. టెస్ట్ మ్యాచ్ అనంతరం హరారే వేదికగా మూడు టీ20లు (అక్టోబర్ 29, 21, నవంబర్ 2) జరుగనున్నాయి.
చదవండి: రిటైరయ్యే వయసులో అరంగేట్రం.. పాక్ ప్లేయర్ అరుదైన ఘనత