
85 బంతుల్లో 23 ఫోర్లు, 3 సిక్స్‌లతో 137 నాటౌట్
మూడో వన్డేలో ఆస్ట్రేలియా మహిళల ‘ఎ’ జట్టు విజయం
9 వికెట్లతో భారత ‘ఎ’ జట్టు ఓటమి
రాణించిన షఫాలీ వర్మ, యస్తిక
2–1తో టీమిండియాదే సిరీస్
బ్రిస్బేన్: ఆ్రస్టేలియా గడ్డపై ఇప్పటికే వన్డే సిరీస్ చేజిక్కించుకున్న భారత మహిళల ‘ఎ’ జట్టు చివరి మ్యాచ్‌లో పరాజయం పాలైంది. ఆ్రస్టేలియా ‘ఎ’ జట్టుతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన మూడో వన్డేలో 9 వికెట్ల తేడాతో ఓడి 2–1తో సిరీస్ ఖాతాలో వేసుకుంది. స్టార్ బ్యాటర్ అలీసా హీలీ (85 బంతుల్లో 137 నాటౌట్; 23 ఫోర్లు, 3 సిక్స్‌లు) విజృంభించడంతో ఆ్రస్టేలియా ‘ఎ’ జట్టు అలవోకగా విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత ‘ఎ’ జట్టు 47.4 ఓవర్లలో 216 పరుగులకు ఆలౌటైంది.
ఓపెనర్ షఫాలీ వర్మ (59 బంతుల్లో 52; 7 ఫోర్లు) అర్ధశతకంతో మెరవగా... వికెట్ కీపర్ యస్తిక భాటియా (54 బంతుల్లో 42; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించింది. నందిని కశ్యప్ (53 బంతుల్లో 28; 2 ఫోర్లు), రాఘ్వీ బిస్త్ (32 బంతుల్లో 18; 2 ఫోర్లు), తనూశ్రీ సర్కార్ (22 బంతుల్లో 17), కెప్టెన్ రాధా యదవ్ (22 బంతుల్లో 18; 1 ఫోర్, 1 సిక్స్) మెరుగైన ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. తేజల్ హసబ్నిస్ (1) విఫలమైంది. ఆ్రస్టేలియా ‘ఎ’ జట్టు బౌలర్లలో తహిలా మెక్‌గ్రాత్ 40 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టింది.
సియానా జింజర్ 50 పరుగులిచ్చి 2 వికెట్లు, ఎల్లా హేవార్డ్ 43 పరుగులిచ్చి 2 వికెట్లు, అనిక లెరాయిడ్ 16 పరుగులిచ్చి 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టు 27.5 ఓవర్లలోనే ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 222 పరుగులు చేసింది. హీలీ అజేయ శతకంతో చెలరేగగా... తహీలా విల్సన్ (51 బంతుల్లో 59; 8 ఫోర్లు) అర్ధశతకం సాధించింది. భారత బౌలర్లలో రాధా యాదవ్ ఒక వికెట్ పడగొట్టింది. ఇరు జట్ల మధ్య గురువారం నుంచి ఇక్కడే ఏకైక అనధికారిక టెస్టు మ్యాచ్ జరగనుంది.
దంచికొట్టిన హీలీ..
గాయం నుంచి కోలుకొని వచ్చిన అలీసా హీలీ... భారత ‘ఎ’ జట్టుతో పరిమిత ఓవర్ల సిరీస్‌లను సంపూర్ణంగా వినియోగించుకుంది. మొదట టి20 సిరీస్‌తో లయ అందుకున్న హీలీ... వన్డే సిరీస్‌లో అదరగొట్టింది. గత మ్యాచ్‌లో త్రుటిలో సెంచరీ చేజార్చుకున్న అలీసా... ఈ మ్యాచ్‌లో అజేయ శతకంతో అదరగొట్టింది. 7 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హీలీ ఇచ్చిన క్యాచ్‌ను భారత ఫీల్డర్లు నేలపాలు చేయగా... దాన్ని వినియోగించుకున్న ఆస్ట్రేలియా సీనియర్ జట్టు రెగ్యులర్ కెప్టెన్ బౌండరీలతో చెలరేగింది.
రెండో ఓవర్‌లో ఫోర్‌తో మోత ప్రారంభించిన హీలీ... భారీ సిక్స్‌తో లక్ష్యఛేదనను పూర్తి చేసేంతవరకు అదే జోరు కొనసాగించింది. ఆంధ్రప్రదేశ్ బౌలర్ షబ్నమ్ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌లో హ్యాట్రిక్ ఫోర్లు బాదిన హీలీ... మిన్ను మణి, తనూజ కన్వర్ ఓవర్లలో రెండేసి ఫోర్లు కొట్టింది. మరో ఎండ్ నుంచి తహిలా విల్సన్ కూడా ధాటిగా ఆడటంతో ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టు స్కోరు బోర్డు పరుగులు పెట్టింది.
షబ్నమ్ ఓవర్‌లో మరో రెండు ఫోర్లు కొట్టిన హీలీ 30 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకుంది. తొలి వికెట్‌కు 137 పరుగులు జోడించిన అనంతరం తహిలా వెనుదిరగగా... హీలీ మాత్రం అదే జోష్ కనబర్చింది. మిన్ను మణి వేసిన ఇన్నింగ్స్ 21వ ఓవర్‌లో 4, 4, 6 కొట్టి 64 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకుంది. మరో ఎండ్ నుంచి రాచెల్ (21 నాటౌట్) సహకారం లభించడంతో హీలీ జట్టును విజయతీరాలకు చేర్చింది