
కాన్పూర్ వేదికగా భారత్-ఏతో (India-A) ఇవాళ (అక్టోబర్ 5) జరుగుతున్న నిర్ణయాత్మక వన్డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా-ఏ (Australia-A) భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసి 49.1 ఓవర్లలో 316 పరుగులకు ఆలౌటైంది. కూపర్ కన్నోలీ (64), లియామ్ స్కాట్ (73), కెప్టెన్ జాక్ ఎడ్వర్డ్స్ (89) అర్ద సెంచరీలతో సత్తా చాటి ఆసీస్ భారీ స్కోర్ చేసేందుకు దోహదపడ్డారు.
44 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో కన్నోలీ.. లిచ్లన్ షా (32) సాయంతో ఇన్నింగ్స్‌కు జీవం పోశాడు. ఆతర్వాత లియామ్ స్కాట్, ఎడ్వర్డ్స్ సంచలన ఇన్నింగ్స్‌లతో భారీ స్కోర్ అందించారు. స్కాట్, ఎడ్వర్డ్స్ ఏడో వికెట్‌కు 152 పరుగులు జోడించి, భారత్‌కు కఠిన సవాల్ విసిరారు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో స్టార్ బ్యాటర్ జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ (5) వరుసగా మూడో మ్యాచ్‌లో నిరాశపరిచాడు.
ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఏకంగా ఎనిమిది మంది బౌలర్లను ప్రయోగించాడు. వీరిలో అర్షదీప్ సింగ్ (10-2-38-3) ఒక్కడే సామర్థ్యం మేరకు రాణించగా.. హర్షిత్ రాణా (9.1-0-61-3) వికెట్లు తీసినప్పటికీ ధారళంగా పరుగులు సమర్పించుకున్నాడు.
పార్ట్ టైమ్ బౌలర్ ఆయుశ్ బదోని 2 వికెట్లు తీయగా.. గుర్జప్నీత్ సింగ్, నిషాంత్ సంధు తలో వికెట్ దక్కించుకున్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్ విప్రాజ్ నిగమ్‌కు (6-0-60-0) ఆసీస్ ఆటగాళ్లు చుక్కలు చూపించారు. అభిషేక్ శర్మ (4-0-19-0) పర్వాలేదనిపించాడు.
కాగా, ఈ మ్యాచ్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరుగుతుంది. ఈ సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌ల్లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచాయి. వన్డే సిరీస్‌కు ముందు ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్ట్ సిరీస్ కూడా జరిగింది. ఆ సిరీస్‌కు భారత్ 1-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌ల కోసం ఆస్ట్రేలియా-ఏ జట్టు భారత్‌లో పర్యటిస్తుంది.
చదవండి: World Cup 2025: భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు ముందు టాస్ గందరగోళం