
వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్-2026 (T20 WC 2026) టోర్నమెంట్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా తమ ఓపెనింగ్ జోడీని ఖరారు చేసింది. కెప్టెన్ మిచెల్ మార్ష్ (Mitchell Marsh)తో పాటు ట్రవిస్ హెడ్ (Travis Head) వరల్డ్‌కప్ దాకా ఓపెనర్లుగానే కొనసాగుతారని స్పష్టం చేసింది. సీఏ తరఫున కెప్టెన్ మిచెల్ మార్ష్ ఈ విషయాన్ని వెల్లడించాడు.
గొప్ప అనుబంధం
‘‘నేను, హెడీ (ట్రవిస్ హెడ్) సుదీర్ఘకాలం పాటు ఓపెనర్లుగానే ఉంటాము. మేమిద్దరం కలిసి ఎన్నో మ్యాచ్‌లు ఆడాము. మా మధ్య గొప్ప అనుబంధం ఉంది’’ అని మిచెల్ మార్ష్ తెలిపాడు. సౌతాఫ్రికాతో సొంతగడ్డపై పరిమిత ఓవర్ల సిరీస్‌కు ముందు మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.
కాగా వన్డేల్లో ఓపెనింగ్ జోడీగా ట్రవిస్ హెడ్- మిచెల్ మార్ష్‌కు మంచి రికార్డే ఉంది. ఐదు ఇన్నింగ్స్‌లో కలిపి 70.50 సగటుతో వీరిద్దరు కలిసి 282 పరుగులు రాబట్టారు. ఇక అన్ని ఫార్మాట్లలో కలిపి 504 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
ఇదిలా ఉంటే.. 2021 టీ20 ప్రపంచకప్ టోర్నీలో మార్ష్ మూడో స్థానంలో బరిలోకి దిగి అదరగొట్టాడు. న్యూజిలాండ్‌తో ఫైనల్లో 50 బంతుల్లో 77 పరుగులతో అజేయంగా నిలిచి.. జట్టును విజేతగా నిలిపాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు.
ఆ తర్వాత.. డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్ నేపథ్యంలో మార్ష్ ఓపెనర్‌గా ప్రమోట్ అయ్యాడు. అయితే, ఇటీవల వెస్టిండీస్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో బ్యాటర్ (81 పరుగులు)గా విఫలమైనా కెప్టెన్‌గా మాత్రం రాణించాడు. మార్ష్ సారథ్యంలో ఆసీస్ 5-0తో వెస్టిండీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది.
కాగా గతేడాది వార్నర్ రిటైర్ అయిన తర్వాత.. మ్యాట్ షార్ట్,గ్లెన్ మాక్స్‌వెల్, జేక్ ఫ్రేజర్-మెగర్క్.. ఇలా చాలా మందిని ఓపెనర్లుగా ట్రై చేసింది ఆస్ట్రేలియా. అయితే, చివరకు మార్ష్- హెడ్ జోడీని ఫైనల్ చేసింది.
ప్రమాదకరంగా ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్
భారత్- శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనున్న టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి మార్ష్- హెడ్ ఆసీస్ ఓపెనర్లుగా ఖరారు కాగా.. డేంజరస్ బ్యాటర్లతో జట్టు మొత్తం పటిష్టంగానే కనిపిస్తోంది.
ఇటీవల వెస్టిండీస్ పర్యటనలో 37 బంతుల్లోనే శతకం బాదిన టిమ్ డేవిడ్.. ఆస్ట్రేలియా తరఫున అంతర్జాతీయ టీ20లలో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. మరోవైపు.. 23 ఏళ్ల మిచెల్ ఓవెన్ అరంగేట్రంలోనే 26 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు.
వీరితో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ కామెరాన్ గ్రీన్ ఆల్‌రౌండ్ ప్రతిభతో ఆకట్టుకున్నాడు. ఇక గ్లెన్ మాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏదేమైనా ఈసారి ఆసీస్ ప్రపంచకప్ టోర్నీలో ప్రత్యర్థులకు గట్టిపోటీనివ్వడం ఖాయం అనిపిస్తోంది.
చదవండి: సిరాజ్ నాపై కోపంగా ఉండేవాడు.. ఇప్పటికీ అంతే: అజింక్య రహానే