
మెక్‌కే వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో ఆస్ట్రేలియా బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ ఘనమైన ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ తొలి బంతి నుంచే సౌతాఫ్రికా బౌలర్లపై విరుచుకు పడ్డారు.
గ్రేట్ బారియర్ రీఫ్ అరీనాలో బౌండరీల వర్షం కురిపించారు. వీరిద్దిరూ తొలి వికెట్‌కు 250 పరుగుల భాగస్వామ్యం కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ సీనియర్ ప్లేయర్లు ఇద్దరూ సెంచరీలతో సత్తాచాటారు. హెడ్ కేవలం 103 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్స్‌లతో 142 పరుగులు చేయగా.. మార్ష్ 106 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 100 పరుగులు చేశాడు.
అతడితో పాటు కామెరూన్ గ్రీన్(55 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్స్‌లతో 118 పరుగులు) సెంచరీతో కదం తొక్కాడు. వీరి ముగ్గురి విధ్వంసం ఫలితంగా ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి ఏకంగా 431 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇక ఈ మ్యాచ్‌లో సెంచరీలతో మెరిసిన కంగారూ జట్టు ఓపెనర్లు పలు అరుదైన రికార్డులను తమ పేరిట లిఖించుకున్నారు.
తొలి ఓపెనింగ్ జోడీగా..
👉వన్డేల్లో దక్షిణాఫ్రికా అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా హెడ్-మార్ష్ రికార్డులకెక్కాడు. ఇంతకుముందు ఈ వరల్డ్ రికార్డు ఇంగ్లండ్ ఆటగాళ్లు వి సోలంకి, మార్క్ ట్రెస్కోథిక్ పేరిట ఉండేది.
వీరిద్దరూ 2003లో ఓవల్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన వన్డేలో తొలి వికెట్‌కు 200 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తాజా మ్యాచ్‌తో 22 ఏళ్ల ఆల్‌టైమ్ రికార్డును హెడ్-మార్ష్ బ్రేక్ చేశారు.
👉దక్షిణాఫ్రికాపై ఒక వన్డే ఇన్నింగ్స్‌లో సెంచరీలు చేసిన మూడో ఓపెనింగ్ జోడీగా మార్ష్-హెడ్ నిలిచారు. వీరిద్దరి కంటే ముందు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ.. వి సోలంకి, మార్క్ ట్రెస్కోథిక్ జోడీలు ఉన్నాయి.
👉వన్డేల్లో సౌతాఫ్రికాపై ఆసీస్ తరపున అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన మూడో ప్లేయర్‌గా హెడ్(142) నిలిచాడు. ఈ జాబితాలో ఆసీస్ మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అగ్రస్ధానంలో ఉన్నాడు. 2016లో కేప్‌టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన వన్డేలో వార్నర్ 173 పరుగులు చేశాడు.