భారత్‌ ఐదేళ్ల రికార్డును బద్దలు కొట్టిన ఆసీస్‌; టి20ల్లో మనమే నెంబర్‌ వన్‌

Australia Claim No1 Test Spot Break India 5Ys Record ICC Annual Rankings - Sakshi

అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసీసీ) బుధవారం వార్షిక ర్యాంకింగ్స్ ప్రకటించింది. టి20ల్లో నెంబర్‌వన్‌గా టీమిండియా నిలిచింది. రోహిత్‌ శర్మ కెప్టెన్సీలోని టీమిండియా 270 పాయింట్లతో  అగ్రస్థానంలో నిలవగా.. 265 పాయింట్లతో ఇంగ్లండ్ రెండో స్థానంలో.. 261 పాయింట్లతో పాకిస్థాన్ మూడో స్థానంలో నిలిచింది.  ఇక 253 పాయింట్లతో దక్షిణాఫ్రికా 4వ స్థానంలో.. 251పాయింట్లతో ఆస్ట్రేలియా ఐదో స్థానంలో ఉన్నాయి.

అయితే టెస్టుల్లో మాత్రం టీమిండియా రెండో స్థానంలో నిలిచింది. వరుసగా ఐదేళ్ల పాటు టెస్టుల్లో టాప్‌ స్థానంలో కొనసాగిన భారత్‌కు ఆస్ట్రేలియా షాక్‌ ఇచ్చింది. ఇటీవలే ఇంగ్లండ్‌ను 4-0తో, ఆ తర్వాత పాకిస్తాన్‌ను వారి గడ్డపైనే 1-0తో కమిన్స్‌ సేన ఓడించిన సంగతి తెలిసిందే. దీంతో ఆస్ట్రేలియా 128 పాయింట్లతో టీమిండియాను వెనక్కినెట్టి అగ్రస్థానంలో నిలిచింది. 119 పాయింట్లతో భారత్ రెండోస్థానంలో నిలవగా.. 111 పాయింట్లతో న్యూజిలాండ్ మూడో స్థానంలో ఉంది. కోహ్లి నేతృత్వంలో టీమిండియా టెస్టుల్లో ఐదేళ్ల పాటు అంటే 2017 నుంచి 2022 వరకు వరుసగా ప్రతీ ఏడాది ఐసీసీ వార్షిక ర్యాంకింగ్స్‌లో టాప్‌ స్థానంలో నిలిచి కొత్త చరిత్ర సృష్టించింది.

మేజర్‌ టోర్నీలు గెలవలేదనే అపవాదు ఉన్న కోహ్లికి టెస్టుల్లో మాత్రం మంచి రికార్డు ఉంది. టీమిండియా కెప్టెన్‌గా అత్యధిక టెస్టు విజయాలు చూసిన ఆటగాడిగా కోహ్లి రికార్డు అందుకున్నాడు. భారత్‌కు 60 టెస్టుల్లో కెప్టెన్‌గా ప్రాతినిధ్యం వహించిన కోహ్లి 40 విజయాలు అందించాడు. కోహ్లి కెప్టెన్సీలో టీమిండియా స్వదేశంలో రికార్డు స్థాయిలో 11 సిరీస్‌ విజయాలు సాధించింది. 2018-19లో ఆస్ట్రేలియా గడ్డపై సిరీస్‌ విక్టరీ అందుకొని కోహ్లి సేన చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత 2021లో ఇంగ్లండ్‌ గడ్డపై ఐదు టెస్టుల సిరీస్‌లో 4-0తో ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా గడ్డపై సెంచురియన్‌ వేదికగా కెప్టెన్‌గా చారిత్రక విజయాన్ని అందుకున్న కోహ్లి.. ఆ తర్వాత వరుసగా రెండు టెస్టులు ఓడిపోయి సిరీస్‌ను కోల్పోయింది. ఈ సిరీస్‌ తర్వాత కోహ్లి కెప్టెన్‌గా తప్పుకోవడం.. రోహిత్‌ శర్మ నాయకత్వ బాధ్యతలు అప్పగించడం జరిగిపోయింది. ఆ తర్వాత స్వదేశంలోన్యూజిలాండ్‌, వెస్టిండీస్‌లతో టెస్టు సిరీస్‌ను భారత్‌ గెలుచుకుంది.

ఇక వన్డేల్లో న్యూజిలాండ్ 125 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా..ఇంగ్లండ్‌ 124 పాయింట్లతో రెండోస్థానంలో ఉంది. 107 పాయింట్లతో ఆస్ట్రేలియా మూడోస్థానంలో  ఉండగా.. భారత్  105 పాయింట్లతో నాలుగోస్థానానికి పరిమితమైంది. ఇక చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ఐదో స్థానంలో నిలిచింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top