
రాధా- నికోల్ (PC: BCCI Women X)
ఆస్ట్రేలియా పర్యటనలో భారత్-‘ఎ’ మహిళా జట్టు (AUS A W vs IND A W)కు తొలి ప్రయత్నంలోనే చేదు అనుభవం ఎదురైంది. మొదటి టీ20 మ్యాచ్‌లో రాధా యాదవ్ (Radha Yadav) సేన ఆసీస్-‘ఎ’ మహిళా జట్టు చేతిలో ఓటమిపాలైంది. ఆఖరి వరకు పోరాడినా ఆతిథ్య జట్టుపై పైచేయి సాధించలేకపోయింది.
కాగా ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ ప్రారంభానికి ముందు భారత యువ క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా ఆసీస్‌తో మూడు టీ20లతో పాటు మూడు వన్డేలు, ఓ అనధికారిక టెస్టు మ్యాచ్ ఆడనుంది. ఇందులో భాగంగా గురువారం టీ20 సిరీస్ ఆరంభమైంది.
అనికా హాఫ్ సెంచరీ
మకాయ్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 137 పరుగులు సాధించింది. ఓపెనర్లలో ఆస్ట్రేలియా రెగ్యులర్ జట్టు కెప్టెన్ అలిసా హేలీ (18 బంతుల్లో 27) ఫరవాలేదనిపించగా.. తహీలా విల్సన్ (23 బంతుల్లో 17) మాత్రం విఫలమైంది.
ఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్ అనికా లియరాడ్ అద్భుత ఇన్నింగ్స్‌తో అలరించింది. 44 బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్ల సాయంతో 50 పరుగులు చేసి ఆఖరి వరకు అజేయంగా నిలిచింది. మిగతా వాళ్లలో కోర్ట్‌నీ (11), కెప్టెన్ నికోల్ ఫాల్టమ్ (11) మాత్రం డబుల్ డిజిట్ స్కోరు చేయగలిగారు.
స్టార్ ఓపెనర్ షఫాలీ వర్మ విఫలం
భారత బౌలర్లలో సైమా ఠాకూర్, సీజవన్ సజన చెరో వికెట్ తీయగా.. ప్రేమా రావత్ మూడు వికెట్లతో సత్తా చాటింది. ఇక 138 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ షఫాలీ వర్మ (3) దారుణంగా విఫలమైంది. వన్‌డౌన్లో వచ్చిన ధారా గుజ్జర్ (7), ఆ తర్వాతి స్థానంలో బ్యాటింగ్ చేసిన దినేశ్ వ్రింద (5) కూడా నిరాశపరిచారు.
రాఘవి బిస్త్ మెరుపులు వృథా
ఇలాంటి క్లిష్ట దశలో మరో ఓపెనర్ ఉమా ఛెత్రి (31 బంతుల్లో 31) మెరుగ్గా ఆడగా.. రాఘవి బిస్త్ (20 బంతుల్లో 33) ఆఖర్లో మెరుపులు మెరిపించింది. ఈమెకు తోడుగా కెప్టెన్ రాధా యాదవ్ (22 బంతుల్లో 26) రాణించింది.
కానీ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 124 పరుగులే చేసిన భారత జట్టు.. విజయానికి 13 పరుగుల దూరంలో నిలిచిపోయింది. దీంతో ఆసీస్ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరుజట్ల మధ్య శనివారం (ఆగష్టు 9) రెండో టీ20కి షెడ్యూల్ ఖరారైంది.