
యస్తిక భాటియాకూ చోటు
టి20ల్లో తొలిసారి శ్రీచరణికి అవకాశం
ఇంగ్లండ్‌తో పోరుకు భారత మహిళల జట్టు ప్రకటన
న్యూఢిల్లీ: ఇంగ్లండ్ పర్యటనలో 5 టి20లు, 3 వన్డేల్లో పాల్గొనే భారత మహిళల జట్టును గురువారం సెలక్టర్లు ప్రకటించారు. టి20ల కోసం 15 మందిని, వన్డేలకు 16 మందిని ఎంపిక చేయగా... రెండు టీమ్‌లకు హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా, స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్‌కు ముందు మన జట్టు ఆడనున్న ఆఖరి వన్డే సిరీస్ ఇదే కానుంది. దూకుడైన ఆటతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ ఓపెనర్ షఫాలీ వర్మ భారత జట్టులో పునరాగమనం చేసింది.
గత ఏడాది అక్టోబరు తర్వాత ఆమె స్థానం కోల్పోయింది. ఉమెన్ ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫు 9 మ్యాచ్‌లలో 304 పరుగులు చేసి షఫాలీ సత్తా చాటింది. అయితే షఫాలీని టి20లకు మాత్రమే ఎంపిక చేసిన సెలక్టర్లు వన్డే జట్టులో స్థానం కల్పించలేదు. వికెట్ కీపర్ బ్యాటర్ యస్తిక భాటియా కూడా తిరిగి జట్టులోకి వచ్చింది. గత ఏడాది నవంబరులో మణికట్టు గాయంతో ఆమె ఆటకు దూరమైంది.
యస్తికకు వన్డే, టి20 రెండు టీమ్‌లలో చోటు లభించింది. ఇటీవల శ్రీలంకతో ముక్కోణపు టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచిన స్నేహ్ రాణా కూడా టి20ల్లో మళ్లీ చోటు దక్కించుకుంది. ఇదే టోర్నీలో ఆకట్టుకున్న ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ఆర్ కడప జిల్లాకు చెందిన లెఫ్టార్మ్ స్పిన్నర్ నల్లపురెడ్డి శ్రీచరణి తొలిసారి టి20 టీమ్‌లోకి ఎంపికైంది. హైదరాబాద్ పేసర్ అరుంధతి రెడ్డి కూడా టి20 జట్టులోకి పునరాగమనం చేసింది.
భారత టి20 జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, యస్తిక భాటియా, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, స్నేహ్ రాణా, శ్రీచరణి, శుచి ఉపాధ్యాయ్, అమన్‌జోత్ కౌర్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, సయాలీ సత్‌ఘరే.
భారత వన్డే జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), ప్రతీక రావల్, హర్లీన్ డియోల్, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, యస్తిక భాటియా, తేజల్, దీప్తి శర్మ, స్నేహ్ రాణా, శ్రీచరణి, శుచి ఉపాధ్యాయ్, అమన్‌జోత్ కౌర్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, సయాలీ సత్‌ఘరే.
భారత్, ఇంగ్లండ్ సిరీస్ షెడ్యూల్
తొలి టి20: జూన్ 28 నాటింగ్‌హామ్
రెండో టి20: జూలై 1 బ్రిస్టల్
మూడో టి20: జూలై 4 ఓవల్
నాలుగో టి20: జూలై 9 మాంచెస్టర్
ఐదో టి20: జూలై 12 బర్మింగ్‌హామ్
తొలి వన్డే: జూలై 16 సౌతాంప్టన్
రెండో వన్డే: జూలై 19 లార్డ్స్
మూడో వన్డే: జూలై 22 చెస్టర్ లీ స్ట్రీట్