కీలక సిరీస్‌కు ముందు ఆసీస్‌కు షాక్‌! | Pat Cummins set to miss New Zealand T20Is Reason Is | Sakshi
Sakshi News home page

కీలక సిరీస్‌కు ముందు ఆసీస్‌కు షాక్‌!

Aug 30 2025 7:58 PM | Updated on Aug 30 2025 8:49 PM

Pat Cummins set to miss New Zealand T20Is Reason Is

న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్‌ పేసర్‌, టెస్టు జట్టు కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ (Pat Cummins) జట్టుకు దూరమయ్యాడు. ఫిట్‌నెస్‌ సమస్యల కారణంగా అతడు న్యూజిలాండ్‌ పర్యటనకు దూరంగా ఉండనున్నాడు.

మూడు టీ20లు
కాగా మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ ఆడే నిమిత్తం ఆస్ట్రేలియా జట్టు న్యూజిలాండ్‌ (NZ vs AUS)లో పర్యటించనుంది. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య అక్టోబరు 1, 3, 4 తేదీల్లో మూడు మ్యాచ్‌ల నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారైంది. ఈ సిరీస్‌ మొత్తం మౌంట్‌మౌంగనీయ్‌లోని బే ఓవల్‌ మైదానంలోనే జరుగనుంది.

ఇదిలా ఉంటే.. కమిన్స్‌ గత కొంతకాలంగా ఆసీస్‌ పరిమిత ఓవర్ల క్రికెట్‌ జట్టుకు దూరంగా ఉంటున్నాడు. ఇటీవల వెస్టిండీస్‌, సౌతాఫ్రికాలతో సిరీస్‌లలో కంగారూ జట్టు కమిన్స్‌ లేకుండానే బరిలోకి దిగింది. తాజాగా అతడు కివీస్‌ జట్టుతో సిరీస్‌కు కూడా దూరం కానున్నట్లు తెలిసింది.

టీమిండియాతో సిరీస్‌కు రెడీ
వెన్నునొప్పి కారణంగా కమిన్స్‌ న్యూజిలాండ్‌ పర్యటనకు అందుబాటులో ఉండటం లేదని కోడ్‌ స్పోర్ట్స్‌ తెలిపింది. అయితే, టీమిండియాతో అక్టోబరులో జరిగే వన్డే సిరీస్‌కు మాత్రం కమిన్స్‌ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. నిజానికి చాలాకాలంగా కమిన్స్‌ వైట్‌బాల్‌ సిరీస్‌లకు దూరంగా ఉంటున్నాడు.

ఇంగ్లండ్‌తో నవంబరులో మొదలయ్యే ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌ కోసం కమిన్స్‌ను క్రికెట్‌ ఆస్ట్రేలియా కాపాడుకుంటోంది. సారథి ఫిట్‌గా ఉంటేనే.. ఈ కీలక టెస్టు సిరీస్‌లో ఆసీస్‌ మరింత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగగలదు. సొంతగడ్డపై జరిగే ఈ ఐదు టెస్టుల సిరీస్‌లో తప్పక గెలవాలని ఆస్ట్రేలియా భావిస్తోంది. 

యాషెస్‌ సిరీస్‌ ఆరంభం అపుడే
కాగా చివరగా 2023లో ఇంగ్లండ్‌లో జరిగిన యాషెస్‌ సిరీస్‌ను ఆసీస్‌ 2-2తో సమం చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ ఏడాది నవంబరు 21- జనవరి 8 వరకు యాషెస్‌ సిరీస్‌ జరుగనుంది.

అంతకంటే ముందు.. న్యూజిలాండ్‌ పర్యటనను పూర్తి చేసుకుని ఆసీస్‌ స్వదేశానికి తిరిగి వచ్చి.. టీమిండియాతో పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడనుంది. అక్టోబరు 19- నవంబరు 8 మధ్య భారత్‌తో ఆసీస్‌ మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు షెడ్యూల్‌ ఖరారైంది. 

చదవండి: వైభవ్‌? ఆయుశ్‌ మాత్రే?.. అతడే ముందుగా టీమిండియాలోకి వస్తాడు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement