
ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరీస్ (NZ vs AUS)కు ముందు న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. వైట్‌బాల్ రెగ్యులర్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (Mitchell Santner) సర్జరీ కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ ధ్రువీకరించింది.
విజయవంతమైన కెప్టెన్.. మరోసారి
ఆస్ట్రేలియాతో చాపెల్- హెడ్లీ టీ20 సిరీస్‌కు జట్టు ప్రకటన సందర్భంగా కివీస్ బోర్డు ఈ విషయాన్ని తెలియజేసింది. సాంట్నర్ గైర్హాజరీలో మైకేల్ బ్రాస్‌వెల్ (Michael Bracewell) న్యూజిలాండ్ జట్టును ముందుకు నడిపించనున్నాడు. ఈ ఆల్‌రౌండర్ సారథ్య బాధ్యతలు నిర్వర్తించడం ఇదే తొలిసారి కాదు.
ఆ ఇద్దరి రీ ఎంట్రీ
ఇప్పటి వరకు పది టీ20 మ్యాచ్‌లలో బ్లాక్‌క్యాప్స్‌కు నాయకత్వం వహించిన బ్రాస్‌వెల్ ఆరు విజయాలు సాధించాడు. ఇదిలా ఉంటే.. ఆసీస్‌తో టీ20 సిరీస్ ద్వారా కివీస్ పేసర్లు కైలీ జెమీషన్, బెన్ సియర్స్ జట్టులోకి తిరిగి వచ్చారు. తొలి సంతానానికి స్వాగతం పలికే క్రమంలో జెమీషన్ జింబాబ్వేతో సిరీస్‌కు దూరం కాగా.. సియర్స్ పక్కటెముకల నొప్పితో మ్యాచ్‌లు ఆడలేకపోయాడు.
అయితే, తాజాగా వీరిద్దరు ఆసీస్‌తో సిరీస్ నేపథ్యంలో పునరాగమనం చేయనున్నారు. జెమీషన్, సియర్స్ రాకతో పేస్ దళం మరింత పటిష్టంగా మారింది. వీరితో పాటు మ్యాట్ హెన్రీ, జేకబ్ డఫీ కూడా పేస్ విభాగంలో సేవలు అందించనున్నారు.
తప్పుకొన్న కేన్ విలియమ్సన్
ఇదిలా ఉంటే.. కెప్టెన్ సాంట్నర్‌తో పాటు ఫిన్ అలెన్, లాకీ ఫెర్గూసన్, ఆడమ్ మిల్నే, విలియమ్ ఒరూర్కీ, గ్లెప్ ఫిలిప్స్ తదితరులు అనారోగ్య కారణాలు, ఫిట్‌నెస్ సమస్యల కారణంగా ఆసీస్‌తో సిరీస్‌కు దూరమయ్యారు.
మరోవైపు.. సీనియర్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ తానే స్వయంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. దీంతో బ్రాస్‌వెల్ కెప్టెన్‌గా మరోసారి రంగంలోకి దిగనున్నాడు. కాగా కివీస్ సొంతగడ్డపై అక్టోబరు 1- 4 మధ్య ఆసీస్‌తో మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది.
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు న్యూజిలాండ్ జట్టు
మైకేల్ బ్రాస్‌వెల్ (కెప్టెన్), మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, జేకబ్ డఫీ, జాక్ ఫౌల్క్స్, మ్యాట్ హెన్రీ, బెవాన్ జేకబ్స్, కైలీ జెమీషన్, డారిల్ మిచెల్, రచిన్ రవీంద్ర, టిమ రాబిన్సన్, బెన్ సియర్స్, టిమ్ సీఫర్ట్, ఇష్ సోధి.
న్యూజిలాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా టీ20 సిరీస్ షెడ్యూల్
👉అక్టోబరు 1- తొలి టీ20- బే ఓవల్, మౌంట్ మౌంగనీయ్
👉అక్టోబరు 3- రెండో టీ20- బే ఓవల్, మౌంట్ మౌంగనీయ్
👉అక్టోబరు 4- మూడో టీ20- బే ఓవల్, మౌంట్ మౌంగనీయ్.
చదవండి: చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి.. పొట్టి ఫార్మాట్‌లో తిరుగులేని భారత్