
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి నంబర్ వన్ స్థానానికి చేరుకున్నాడు. గత కొంతకాలంగా అద్భుత ప్రదర్శనలతో చెలరేగుతున్న వరుణ్.. న్యూజిలాండ్ పేసర్ జాకబ్ డఫీను అధిగమించి టాప్ ప్లేస్‌కు చేరాడు.
గత వారం ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానంలో ఉండిన వరుణ్.. మూడు స్థానాలు ఎగబాకి అగ్రపీఠాన్ని అధిరోహించాడు. తద్వారా భారత్ తరఫున నంబర్ వన్‌గా అవతరించిన మూడో బౌలర్‌గా చరిత్రకెక్కాడు. వరుణ్‌కు ముందు జస్ప్రీత్ బుమ్రా, రవి బిష్ణోయ్ నంబర్ వన్ టీ20 బౌలర్లుగా చలామణి అయ్యారు.
2021లో టీ20 అరంగేట్రం చేసిన వరుణ్ ఈ ఏడాది అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. కెరీర్‌లో మొత్తం 20 టీ20లు ఆడిన అతను.. 2 ఐదు వికెట్ల ప్రదర్శనలతో 35 వికెట్లు తీశాడు. ప్రస్తుతం ఆసియా కప్ ఆడుతున్న వరుణ్ అక్కడ కూడా మెరుగైన ప్రదర్శనలే చేస్తున్నాడు. యూఏఈపై, పాక్‌పై పొదుపుగా బౌలింగ్ చేసి తలో వికెట్ తీశాడు.
వరుణ్ అగ్రస్థానానికి చేరుకోవడంతో టీ20 ర్యాంకింగ్స్‌లో భారత ఆధిపత్యం సంపూర్ణమైంది. గతేడాది టీ20 వరల్డ్‌కప్ గెలిచినప్పటి నుండి టీమిండియా నంబర్ వన్ టీ20 జట్టుగా చలామణి అవుతుంది. బ్యాటర్ల విభాగంలో భారత్‌కే చెందిన అభిషేక్ శర్మ నంబర్ టీ20 బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. ఆల్‌రౌండర్ల విభాగంలో భారత్‌కే చెందిన హార్దిక్ పాండ్యా నంబన్ వన్‌గా కొనసాగుతున్నాడు. తాజాగా వరుణ్ నంబర్ వన్ బౌలర్‌గా అవతరించడంతో పొట్టి ఫార్మాట్‌లో భారత్ అన్ని విభాగాల్లో టాప్ ప్లేస్ సాధించినట్లైంది.
ర్యాంకింగ్స్‌లో భారత ఆధిపత్యం టీ20లకే పరిమితం కాలేదు. వన్డేల్లోనూ భారత్ నంబర్ వన్ జట్టుగా కొనసాగుతుంది. ఈ ఫార్మాట్‌లో నంబర్ వన్ బ్యాటర్‌గా టీమిండియాకే చెందిన శుభ్‌మన్ గిల్ చలామణి అవుతున్నాడు.
టెస్ట్ ర్యాంకింగ్స్‌లోనూ భారత హవా కొనసాగుతుంది. నంబర్ వన్ టెస్ట్ బౌలర్‌గా బుమ్రా కొనసాగుతున్నాడు. నంబర్ వన్ టెస్ట్ ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజా ఉన్నాడు. ఓవరాల్‌గా చూస్తే అన్ని ఫార్మాట్ల ర్యాంకింగ్స్‌లో భారత ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తుంది.