
వచ్చే నెలలో న్యూజిలాండ్, భారత్‌తో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌లకు ముందు ఆస్ట్రేలియా జట్టుకు భారీ షాక్‌లు తగిలాయి. స్టార్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కొద్ది సేపట్లోనే టెస్ట్ జట్టు కెప్టెన్, పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో కీలక ప్లేయర్ అయిన పాట్ కమిన్స్ గాయం కారణంగా రెండు సిరీస్‌లకు దూరమైనట్లు ప్రకటన వెలువడింది. కమిన్స్ న్యూజిలాండ్, భారత్ సిరీస్‌లకు అందుబాటులో ఉండడని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అధికారిక ప్రకటన చేసింది.
కమిన్స్‌కు వెన్నెముక కింది భాగంలో సమస్య ఉన్నట్లు వెల్లడించింది. దీంతో కమిన్స్‌ను ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ (నవంబర్ 21) వరకు ఆటకు దూరంగా ఉంచాలని భావిస్తున్నట్లు పేర్కొంది. ఈ మధ్యలో కమిన్స్ దేశవాలీ టోర్నీల్లో (వన్డే కప్, షెఫీల్డ్ షీల్డ్) కూడా పాల్గొనడని తెలిపింది.
కాగా, ఆస్ట్రేలియా వచ్చే నెలలో తొలుత న్యూజిలాండ్ పర్యటనకు వెళ్తుంది. అక్టోబర్ 1, 3, 4 తేదీల్లో మౌంట్ మాంగనూయ్ వేదికగా మూడు టీ20లు ఆడుతుంది. ఆతర్వాత అదే నెల 19 నుంచి భారత్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో మూడు వన్డేలు (19, 23, 25), ఐదు టీ20లు (29, 31, నవంబర్ 2, 6, 8) జరుగుతాయి.
దీని తర్వాత ఆస్ట్రేలియా స్వదేశంలో ఇంగ్లండ్‌తో యాషెస్ సిరీస్ ఆడుతుంది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్ నవంబర్ 21 నుంచి వచ్చే ఏడాది జనవరి 8 వరకు జరుగనుంది. యాషెస్ సిరీస్ కోసం ఫిట్‌గా ఉండడం కోసమే క్రికెట్ ఆస్ట్రేలియా కమిన్స్‌ను చాలాకాలం ఆటకు దూరంగా ఉంచనుంది.