
టీమిండియా ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)పై గత కొన్నాళ్లుగా విమర్శల వర్షం కురుస్తోంది. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ఐదింట అతడు మూడు టెస్టులు మాత్రమే ఇందుకు ప్రధాన కారణం. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కోసమే బుమ్రా విషయంలో తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ముందుగానే ప్రకటించాడు.
ఆడితే ఓడటమే
అందుకు తగినట్లుగానే ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీలో లీడ్స్, లార్డ్స్, మాంచెస్టర్ టెస్టుల్లోనే బుమ్రా ఆడాడు. అతడు ఆడిన ఈ మ్యాచ్‌లలో రెండింట టీమిండియా ఓడింది. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్లు బుమ్రా తనకు నచ్చినపుడు విశ్రాంతి తీసుకుని.. నచ్చినపుడు ఆడటాన్ని విమర్శించారు. మరికొందరు మాత్రం బుమ్రా ఆడితేనే టెస్టుల్లో భారత జట్టుకు ఓటమి తప్పదని ట్రోల్ చేశారు.
నోటికొచ్చినట్లు వాగొద్దు
ఇక ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ను శుబ్‌మన్ గిల్ సేన 2-2తో సమం చేసింది. తదుపరి టీమిండియా ఆసియా టీ20 కప్ టోర్నీ ఆడనుండగా.. బుమ్రా ఈ జట్టులో భాగంగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ బుమ్రా విమర్శకులకు ఘాటుగా కౌంటర్ ఇచ్చాడు.
‘‘ఇంగ్లండ్‌లో బుమ్రా ఆడని మ్యాచ్‌లలోనే టీమిండియా గెలిచిందని నోటికొచ్చినట్లు మాట్లాడేవాళ్లు.. నోళ్లు తెరిచేముందు కాస్త జాగ్రత్తగా ఉండలి. బుమ్రా ఒక్కడే ఫార్మాట్లకు అతీతంగా జట్టును ఎన్నిసార్లు గెలిపించాడో మీకు తెలుసా?
టీమిండియాకు దొరికిన అరుదైన వజ్రం
అతడొక మ్యాచ్ విన్నర్. టీమిండియాకు దొరికిన అరుదైన వజ్రం. అతడి గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదు. అతడి కెరీర్‌పై ఒక్క మచ్చ కూడా లేదు. తనెంతో అంకితభావం గల ఆటగాడు’’ అని బుమ్రాపై కైఫ్ ప్రశంసల వర్షం కురిపించాడు.
ఇక ఆసియా కప్ టోర్నీలో బుమ్రా అన్ని మ్యాచ్‌లు ఆడాల్సిన అవసరం లేదన్న కైఫ్.. ఒమన్, యూఏఈ వంటి జట్లతో ఆడేటపుడు విశ్రాంతి తీసుకోవచ్చని అభిప్రాయపడ్డాడు. ఈసారి టోర్నీ టీ20 ఫార్మాట్లో జరుగుతుంది కాబట్టి.. ఒక్కో మ్యాచ్‌లో కేవలం నాలుగు ఓవర్లే వేయాల్సి ఉన్నందున సమస్య ఉండదని పేర్కొన్నాడు.
యూఏఈ వేదికగా..
ఏదేమైనా భారత టీ20 జట్టులో బుమ్రా పాత్ర ముఖ్యమని.. అతడు లేని జట్టును ఊహించుకోలేమని కైఫ్ పేర్కొన్నాడు. కాగా సెప్టెంబరు 9- 28 వరకు యూఏఈ వేదికగా ఆసియా కప్-2025 టోర్నీకి షెడ్యూల్ ఖరారైంది.
కాగా ఇప్పటి వరకు తన కెరీర్‌లో 70 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన బుమ్రా.. 89 వికెట్లు కూల్చాడు. ఇక ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ రైటార్మ్ పేసర్ 145 మ్యాచ్‌లలో కలిపి 183 వికెట్లు కూల్చాడు.
చదవండి: Asia Cup: టీమిండియాలో దక్కని చోటు: శ్రేయస్ అయ్యర్ రియాక్షన్ వైరల్