Asia Cup 2022: రోహిత్‌, బాబర్‌ సేనలకు భారీ షాక్‌

Asia Cup 2022: India, Pakistan Fined 40 Percent Match Fees For Slow Over Rate - Sakshi

IND VS PAK: ఆసియా కప్‌-2022లో భాగంగా గత ఆదివారం పాక్‌తో జరిగిన హైఓల్టేజీ సమరంలో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌కు సంబంధించి ఐసీసీ తాజాగా ఓ కీలక ప్రకటన విడుదల చేసిం‍ది. స్లో ఓవర్‌ రేట్‌తో బౌలింగ్‌ చేసినందుకు గాను ఐసీసీ భారత్‌, పాక్‌లకు జరిమానా విధించింది. ఇరు జట్ల మ్యాచ్‌ ఫీజ్‌లో ఏకంగా 40 శాతం కోత విధిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. 

ఐసీసీ ప్రవర్తనా నియమావళి ఆర్టికల్ 2.22 ప్రకారం.. మ్యాచ్‌ నిర్ణీత సమయం కంటే ఎక్కువగా జరిగితే ఆటగాళ్లకు స్లో ఓవర్ రేట్‌ ఫైన్‌తో పాటు మ్యాచ్‌లో 30 గజాల సర్కిల్‌ బయట ఐదుగురు ఫీల్డర్లకు బదులు నలుగురిని మాత్రమే అనుమతిస్తారు. ఆ మ్యాచ్‌లో ఇరు జట్లు కోటా సమయాన్ని (గంటన్నర) దాటి అరగంట ఇన్నింగ్స్‌ను పొడిగించారు. దీంతో ఆ అరగంట సమయంలో ఇరు జట్లు ఫీల్డింగ్‌ రెస్ట్రిక్షన్స్‌తో బరిలో నిలిచాయి. 

దీని ప్రభావం భారత్‌తో పోలిస్తే పాక్‌పై అధికంగా పడింది. ఓ రకంగా చెప్పాలంటే ఈ నిబంధనే పాక్‌ కొంపముంచింది. ఛేదనలో హార్ధిక్‌ చెలరేగడానికి ఈ నిబంధన పరోక్ష కారణంగా చెప్పవచ్చు. ఆఖరి మూడు ఓవర్లలో 30 గజాల సర్కిల్‌ బయట నలుగురు ఫీల్డర్లు మాత్రమే ఉండటాన్ని హార్ధిక్‌ అడ్వాంటేజ్‌గా తీసుకుని చెలరేగిపోయాడు. సిక్సర్‌ కొట్టి మరీ జట్టును విజయతీరాలకు చేర్చాడు. 

ఇదిలా ఉంటే, ఆగస్ట్‌ 28న పాక్‌తో హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో టీమిండియా పూర్తి ఆధిపత్యం చలాయించి విజేతగా నిలిచింది. హార్ధిక్‌ పాండ్యా ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించగా.. భువీ, కోహ్లి, జడేజాలు జట్టు విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ 19.5 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌట్‌ కాగా.. టీమిండియా మరో రెండు బంతులు మిగిలుండగానే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది.
చదవండి: మరో బిగ్‌ సండే.. వచ్చే ఆదివారం మరోసారి పాక్‌తో తలపడనున్న టీమిండియా‌..!
 

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top