రోహిత్‌తో నీతా అంబానీ సీరియస్‌ డిస్కషన్‌.. వీడియో వైరల్‌ | Sakshi
Sakshi News home page

Rohit Sharma: రోహిత్‌తో నీతా అంబానీ సీరియస్‌ డిస్కషన్‌.. వీడియో వైరల్‌

Published Sat, May 18 2024 4:59 PM

After Serious Discussion Rohit Receives Special Medal From Neeta Ambani Viral

ఐపీఎల్‌-2024లో తన ఆఖరి మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు ముంబై ఇండియన్స్‌ స్టార్‌ రోహిత్‌ శర్మ. ఈ సీజన్‌లో నిలకడలేని ఫామ్‌తో విమర్శల పాలైన హిట్‌మ్యాన్‌ సొంతగడ్డపై శుక్రవారం ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో మెరిశాడు.

లక్నో సూపర్‌ జెయింట్స్‌తో వాంఖడే వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ 38 బంతుల్లోనే 68 పరుగులు సాధించాడు. ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌ ఇన్నింగ్స్‌లో ఏకంగా 10 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి.

అయితే, రోహిత్‌ శర్మ హాఫ్‌ సెంచరీ ముంబై జట్టును గెలిపించలేకపోయింది. ఈ మ్యాచ్‌లో లక్నో 18 పరుగుల తేడాతో గెలుపొందడంతో లీగ్‌ దశను ఓటమితోనే ముగించింది ముంబై ఇండియన్స్‌.

ఏకంగా పదో పరాజయం నమోదు చేసి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఇదిలా ఉంటే.. ఆఖరి మ్యాచ్‌లో అదరగొట్టిన రోహిత్‌ శర్మను ముంబై ఇండియన్స్‌ కోచ్‌ సిబ్బంది ప్రత్యేక మెడల్‌తో సత్కరించింది.

హిట్‌మ్యాన్‌ను సత్కరించిన నీతా అంబానీ
ప్రధాన కోచ్‌ మార్క్‌ బౌచర్‌ రోహిత్‌ శర్మ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడంటూ ప్రశంసించాడు. మెడల్‌ తీసుకోవడానికి రావాల్సిందిగా రోహిత్‌ శర్మను కోరాడు. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్‌ యజమాని నీతా అంబానీ హిట్‌మ్యాన్‌ జెర్సీకి బ్యాడ్జిని అటాచ్‌ చేసి సత్కరించారు.

అయితే, ఆ సమయంలో రోహిత్‌ శర్మ ముఖంలోగానీ.. నీతా ఫేస్‌లో గానీ ఏమాత్రం సంతోషం కనబడలేదు. నీతా ఏదో మొక్కుబడిగా బ్యాడ్జి పెట్టిన అనంతరం.. రోహిత్‌ ముభావంగా వెనక్కి తిరిగి వచ్చేశాడు.

 

తారస్థాయికి విభేదాలు!
ఇందుకు సంబంధించిన వీడియో నెటిజన్లలో చర్చకు దారి తీసింది. ముంబై ఇండియన్స్‌ యాజమాన్యం రోహిత్‌ శర్మ పట్ల వ్యవహరించిన తీరు చూస్తుంటే.. ఇరు వర్గాల మధ్య విభేదాలు తారస్థాయికి చేరినట్లు కనిపిస్తోందని.. వచ్చే సీజన్‌లో రోహిత్‌ ముంబైకి ఆడకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు. లక్నో చేతిలో ఓటమి తర్వాత రోహిత్‌- నీతా సీరియస్‌గా మాట్లాడుకున్న దృశ్యాలను ఈ సందర్భంగా షేర్‌ చేస్తున్నారు.

 

కాగా ముంబై ఇండియన్స్‌ను అత్యధికంగా ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన ఘనత రోహిత్‌ శర్మది. అయితే, ఐపీఎల్‌-2024కు ముందే అతడిపై వేటు వేసిన ముంబై మేనేజ్‌మెంట్‌.. గుజరాత్‌ టైటాన్స్‌ నుంచి ట్రేడ్‌ చేసుకున్న హార్దిక్‌ పాండ్యాకు కెప్టెన్సీ అప్పగించింది.

అయితే, హార్దిక్‌ సారథ్యంలో ముంబైకి ఘోర పరాభవం ఎదురైంది. ఐపీఎల్‌-2024లో ఆడిన పద్నాలుగు మ్యాచ్‌లలో కేవలం నాలుగు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఇక తాజా ఎడిషన్‌లో మొత్తంగా ముంబై తరఫున 14 మ్యాచ్‌లు ఆడి 417 పరుగులు చేశాడు రోహిత్‌ శర్మ.

చదవండి: T20 WC 2024: టీమిండియా ఆటగాళ్ల న్యూయార్క్‌ ప్రయాణం ఆరోజే!

Advertisement
 
Advertisement
 
Advertisement