
వయసు కేవలం సంఖ్య మాత్రమేనని ఇంగ్లండ్ మాజీ పేసర్ జేమ్స్ ఆండర్సన్ మరోసారి నిరూపించాడు. 42 ఏళ్ల వయసులోనూ కౌంటీ మ్యాచ్ ఆడుతూ ఇరగదీశాడు. కౌంటీ ఛాంపియన్‌షిప్ డివిజన్-2లో భాగంగా లాంకాషైర్‌కు ఆడుతున్న ఆండర్సన్.. డెర్బిషైర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 2 వికెట్లతో సత్తా చాటాడు. ఇందులో ఓ వికెట్ (కాలెబ్ జువెల్) మ్యాచ్ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. ఆండర్సన్ సంధించిన ఇన్ స్వింగింగ్ బంతికి వికెట్లు గాల్లోకి లేచాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. జిమ్మీ లేటు వయసులోనూ ఇరగదీస్తున్నాడని క్రికెట్ అభిమానులు కొనియాడుతున్నారు.
43 YEAR OLD JIMMY ANDERSON FOR LANCASHIRE. 🤯pic.twitter.com/w5AwHTndmv
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 17, 2025
గతేడాది జులైలో అంతర్జాతీయ క్రికెట్‌కు (టెస్ట్‌లకు) రిటైర్మెంట్ ప్రకటించిన ఆండర్సన్.. ఆతర్వాత కొద్ది రోజులు ఇంగ్లండ్ జాతీయ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా పని చేశాడు. ఆతర్వాత 41 ఏళ్ల వయసులో ఐపీఎల్ 2025 మెగా వేలంలో తన పేరును నమోదు చేసుకుని అందరిని ఆశ్చర్యపరిచాడు. ఆండర్సన్ ప్రస్తుతం లాంకాషైర్ తరఫున టీ20, సుదీర్ఘ ఫార్మాట్‌లో కొనసాగుతున్నాడు. అతను ఇంగ్లండ్ దేశవాలీ టీ20 లీగ్ టీ20 బ్లాస్ట్‌లోనూ ఆడనున్నాడు. గత నెలలో కాలి మడమ సమస్యతో బాధపడిన ఆండర్సన్ నెల రోజుల్లోనే కోలుకుని రీఎంట్రీ ఇచ్చాడు. వచ్చీ రాగానే రెండు వికెట్ల ప్రదర్శనతో సత్తా చాటాడు. ఆండర్సన్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్‌గా రిటైరయ్యాడు. 188 మ్యాచ్‌ల్లో అతను 704 వికెట్లు తీశాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన లాంకాషైర్ తొలి ఇన్నింగ్స్‌లో 458 పరుగులకు ఆలౌటైంది. వెల్స్ (141) సెంచరీతో కదంతొక్కగా.. మాథ్యూ హర్ట్స్ (51), జార్జ్ బెల్ (57), బాల్డర్‌సన్ (73) అర్ద సెంచరీలతో రాణించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన డెర్బిషైర్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. ఇందులో ఆండర్సన్ 2 వికెట్లు తీయగా.. టామ్ హార్ట్లీ, వెల్స్ తలో వికెట్ దక్కించుకున్నారు.