ఫిఫా ప్రపంచ కప్-2026 ఆతిథ్య మెక్సికో ఘనంగా ఆరంభించింది. గురవారం ఆర్ధరాత్రి దాటాక జరిగిన ఉత్కంఠభరితమైన తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై 2-0 తేడాతో మెక్సికో ఘన విజయం సాధించింది.మ్యాచ్ ప్రారంభమైన కేవలం 9వ నిమిషంలోనే మెక్సికో ఆటగాడు జూలియన్ క్వినోనెస్ అద్భుతమైన లో షాట్‌తో తన జట్టుకు మొదటి గోల్‌ను అందించాడు.
ఆ తర్వాత 67వ నిమిషంలో రాబర్టో అల్వరాడో ఇచ్చిన క్రాస్‌ను సీనియర్ స్ట్రైకర్ రౌల్ జిమెనెజ్ హెడ్ చేస్తూ గోల్ కొట్టాడు. దీంతో మెక్సికో 2-0తో తిరుగులేని ఆధిక్యంలోకి వెళ్లింది. గోల్ చేసిన అనంతరం జిమెనెజ్ భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకోవడం అందరిని కలిచివేసింది. సౌతాఫ్రికా కనీసం ఒక్క గోల్‌కూడా సాధించలేకపోయింది.
ఫిఫా చరిత్రలోనే
అయితే ఈ మ్యాచ్‌లో ఆటగాళ్లు అభిమానులను కేవలం గోల్స్‌తోనే కాదు వారి దూకుడుతో కూడా అలరించారు. ఆటగాళ్లు తమ హద్దులు మీరి ప్రవర్తించారు. దీంతో మ్యాచ్ రిఫరీ మొత్తం మూడు రెడ్ కార్డులు జారీ చేయాల్సి వచ్చింది. ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలోనే ఒక ఓపెనింగ్ మ్యాచ్‌లో ముగ్గురు ఆటగాళ్లకు రెడ్ కార్డ్ చూపించడం ఇదే మొదటిసారి.
49వ నిమిషంలో మెక్సికో ప్లేయర్ బ్రియాన్ గుటియెర్రెజ్ గోల్ చేయడానికి చేసేందుకు ప్రయత్నించినప్పుడు, అతడిని సౌతాఫ్రికా ప్లేయర్ స్ఫెఫెలో సిథోల్ తోసివేశాడు. ఈ క్రమంలో అతడికి మొదటి రెడ్ కార్డ్‌ను చూపించారు.
అనంతరం 84వ నిమిషంలో మెక్సోకో మిడ్ ఫీల్డర్ ముఖంపై చేయితో కొట్టినందుకు గాను సౌతాఫ్రికా ప్లేయర్ థెంబా జ్వానేకు కూడా రెడ్ కార్డ్ ఇచ్చారు. ఇక మ్యాచ్ ముగుస్తుందనగా మెక్సికో ఆటగాడు సీజర్ మాంటెస్, సౌతాఫ్రికా ప్లేయర్ ఖులిసా ముదౌను ఫౌల్ చేయడంతో అతనికి కూడా రెడ్ కార్డ్ లభించింది.


