
అంతర్జాతీయ టీ20ల్లో నమీబియాకు చెందిన జాన్ ఫ్రైలింక్ అనే అనామక ఆటగాడు విధ్వంసం సృష్టించాడు. జింబాబ్వేతో ఇవాళ (సెప్టెంబర్ 18) జరుగుతున్న మ్యాచ్‌లో కేవలం 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఈ మ్యాచ్‌లో నమీబియా తొలుత బ్యాటింగ్ చేస్తుండగా.. ఫ్రైలింక్ తొలి బంతి నుంచే ఎదురుదాడి మొదలుపెట్టాడు.
తొలి ఓవర్‌లో వరుసగా మూడు ఫోర్లు.. రెండో ఓవర్‌లో రెండు ఫోర్లు, సిక్సర్ బాదిన అతను.. మూడో ఓవర్ గ్యాప్ ఇచ్చి, నాలుగో ఓవర్‌లో విశ్వరూపం ప్రదర్శించాడు. ట్రెవర్ గ్వాండు వేసిన ఆ ఓవర్‌లో రెండు ఫోర్లు, మూడు సిక్సర్లు సహా 26 పరుగులు రాబట్టాడు. ఫ్రైలింక్ ఊచకోత ధాటికి నమీబియా 4 ఓవర్లలో ఏకంగా 70 పరుగులు చేసింది.
హాఫ్ సెంచరీ తర్వాత కూడా కాసేపు మెరుపులు కొనసాగించిన ఫ్రైలింక్.. 31 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 77 పరుగులు చేసి 9వ ఓవర్‌లో ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో ఫ్రైలింక్ చేసిన 13 బంతుల హాఫ్ సెంచరీ, టీ20ల్లో నమీబియా తరఫున అత్యంత వేగవంతమైందిగా రికార్డైంది. ఓవరాల్‌గా చూస్తే అంతర్జాతీయ టీ20ల్లో ఇది మూడో వేగవంతమైన హాఫ్ సెంచరీగా నిలిచింది.
అంతర్జాతీయ టీ20ల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నేపాల్‌కు చెందిన దీపేంద్ర సింగ్ ఏరీ పేరిట ఉంది. ఏరీ 2023 ఆసియా క్రీడల్లో మంగోలియాపై 9 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఏరీ తర్వాత అత్యంత వేగవంతమైన అర్ద శతకం టీమిండియా సిక్సర్ కింగ్ యువరాజ్ సింగ్ పేరిట ఉంది. యువీ 2007 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌పై 12 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.
ఫ్రైలింక్‌కు ముందు మరో ముగ్గురు 13 బంతుల్లో హాఫ్ సెంచరీలు చేశారు. 2019లో ఆస్ట్రియాకు చెందిన మీర్జా ఎహసాన్, 2024లో జింబాబ్వేకు చెందిన మరుమణి, ఇదే ఏడాది టర్కీకి చెందిన ముహమ్మద్ ఫహాద్ 13 బంతుల్లో హాఫ్ సెంచరీలు ఫినిష్ చేశారు.
ఫ్రైలింక్‌కు ముందు నమీబియా తరఫున అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డు లాఫ్టీ ఈటన్ పేరిట ఉంది. గతేడాది లాఫ్టీ నేపాల్‌పై 18 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు.
కాగా, ఫ్రైలింక్ సుడిగాలి అర్ద సెంచరీతో చెలరేగడంతో ఈ మ్యాచ్‌లో నమీబియా భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 7 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. ఫ్రైలింక్ ఔటయ్యాక నెమ్మదించిన నమీబియా స్కోర్ ఆఖర్లో మళ్లీ పుంజుకుంది. రూబెన్ ట్రంపల్‌మన్ (46), అలెగ్జాండర్ (20) జింబాబ్వే బౌలర్లను ఎడాపెడా వాయించారు.
ఫ్రైలింక్‌ను ఔట్ చేయడమే కాకుండా మరో రెండు వికెట్లు (4-0-25-3) తీసిన సికందర్ రజా నమీబియాను కాస్త ఇబ్బంది పెట్టాడు. మపోసా, మసకద్జ, ముజరబానీ తలో వికెట్ తీశారు.
కాగా, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం నమీబియా జట్టు జింబాబ్వేలో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో జింబాబ్వే 33 పరుగుల తేడాతో గెలుపొందింది.