Zomato Cycle Delivery Boy Hyderabad: శభాష్‌.. సైకిల్‌ పోయి బైక్‌ వచ్చే - Sakshi
Sakshi News home page

Zomato: శభాష్‌.. సైకిల్‌ పోయి బైక్‌ వచ్చే

Jun 20 2021 12:23 AM | Updated on Jun 20 2021 12:50 PM

Zomato Cycle Delivery: Netizens Gifted A Bike To Delivery Boy - Sakshi

సైకిల్‌పై ఫుడ్‌ డెలివరీ చేస్తున్న మహ్మద్‌ ఆకీల్‌

సాక్షి, హైదరాబాద్‌: పేదరికంతో ఉన్న కుటుంబానికి అండగా నిలిచేందుకు ఆ యువకుడు అతికష్టమ్మీద చేతనైన పని చేస్తున్నాడు. జొమాటోలో డెలివరీ బాయ్‌గా చేరాడు. అయితే అతడు డెలివరీ చేసేది సైకిల్‌పై. నిజమే జొమాటో యాప్‌లో వచ్చిన ఆర్డర్లు తన సైకిల్‌పై డెలివరీ చేస్తుంటాడు. పేదరికంతో బైక్‌ లేక సైకిల్‌పై ఆర్డర్లు ఇస్తున్న విషయాన్ని ఓ కస్టమర్‌ చూశాడు. ఆ యువకుడి పరిస్థితి చూసి చలించిపోయాడు. వెంటనే అతడి వివరాలు కనుక్కుని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా హైదరాబాద్‌ ప్రజలు చేదోడుగా నిలిచారు. అందరి సహాయంతో ఇప్పుడు ఆ యువకుడికి బైక్‌ లభించింది. ఈ స్టోరీ మన హైదరాబాద్‌లో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.

జూన్‌ 14వ తేదీన హైదరాబాద్‌లోని కింగ్‌కోఠికి చెందిన రాబిన్‌ ముకేశ్‌ జొమాటోలో ఆర్డర్‌ చేశాడు. ఆ ఆర్డర్‌ను పాతబస్తీలోని తలాబ్‌కట్ట ప్రాంతానికి చెందిన మహ్మద్‌ ఆకీల్‌ (21) లక్డీకాపూల్‌ నుంచి పార్సిల్‌ తీసుకుని 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న కింగ్‌కోఠిలో ఇచ్చేందుకు వెళ్లాడు. పార్సిల్‌ తీసుకోవడానికి కిందకు వచ్చిన రాబిన్‌ ముకేశ్‌ ఆకీల్‌ను చూసి షాకయ్యాడు. అతడు డెలివరీ చేసేది ఒక సైకిల్‌పై అని తెలుసుకుని చలించిపోయాడు. పైగా వర్షంలో తడుచుకుంటూ సైకిల్‌పై రావడంతో అతడి పరిస్థితి తెలుసుకున్నాడు. ఆకీల్‌ది పేద కుటుంబం. తల్లిదండ్రులు, ముగ్గురు అక్కాచెల్లెళ్లు, ఒక సోదరుడు ఉన్నాడు. తండ్రి సంపాదన అంతత మాత్రమే ఉండడంతో ఆకీల్‌ డెలివరీ బాయ్‌గా చేరాడు. బైక్‌ కొనే స్థోమత లేక సైకిల్‌పైనే ఫుడ్‌ ఆర్డర్‌ డెలివరీ చేయడం మొదలుపెట్టాడు. జొమాటో వారికి తన పరిస్థితి చెప్పి సైకిల్‌పై డెలివరీ చేస్తున్నాడు. డెలివరీ చేస్తూనే ఆకీల్‌ బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్నాడు.

ఇదంతా విన్న రాబిన్‌ వెంటనే ఈ విషయాలన్నీ 32 వేల మంది ఉన్న ‘ది గ్రేట్‌ హైదరాబాద్‌ ఫుడ్‌ అండ్‌ ట్రావెల్‌’ ఫేస్‌బుక్‌ పేజీలో పోస్టు చేశాడు. అతడికి టీవీఎస్‌ ఎక్స్‌ఎల్‌ వాహనం కొనేందుకు రూ.65,800 కావాలని విజ్ఞప్తి చేశాడు. ఈ పోస్టు చూసిన వారంతా వెంటనే స్పందించి తోచినంత సహాయం చేశారు. దీంతో రెండు రోజుల్లోనే రూ.73 వేలు పోగయ్యాయి. ఆ డబ్బులతో రాబిన్‌ టీవీఎస్‌ ఎక్స్‌ఎల్‌ వాహనం కొని ఆకిల్‌కు అందించాడు. బైక్‌తో పాటు హెల్మెట్‌, రెయిన్‌ కోట్‌, శానిటైజర్‌, మాస్క్‌లు, మిగిలిన డబ్బులను ఆకీల్‌ బీటెక్‌ చదువు ఫీజుల కోసం అందించారు. బైక్‌ రావడంతో ఇప్పుడు మరిన్ని ఆర్డర్లు చేసి అధిక ఆదాయం పొందుతానని ఆకీల్‌ చెబుతున్నాడు. ఈ కథనం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఫేసుబుక్‌ గ్రూప్‌ సభ్యులకు అభినందనలు తెలుపుతున్నారు. ఆకీల్‌ కుటుంబానికి తాము సహాయం చేస్తామని మరికొందరు ముందుకు వస్తున్నారు. ఆకీల్‌ పరిస్థితిపై జూన్‌ 17న ‘సాక్షి’లో ‘ముందుకు సాగిపో.. నీ గమ్యం చేరిపో’ అనే కథనం ప్రచురించిన విషయం తెలిసిందే.

మహ్మద్‌ ఆకీల్‌కు ద్విచక్ర వాహనం అందిస్తున్న ‘ది గ్రేట్‌ హైదరాబాద్‌ ఫుడ్‌ అండ్‌ ట్రావెల్‌’ ఫేసుబుక్‌ గ్రూప్‌ ప్రతినిధులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement