అక్రమంగా వెలిసిన వెంచర్‌ | - | Sakshi
Sakshi News home page

అక్రమంగా వెలిసిన వెంచర్‌

Oct 7 2026 9:14 AM | Updated on Oct 7 2026 9:14 AM

పట్టించుకోని అధికారులు

చిన్నకోడూరు(సిద్దిపేట): పెద్దకోడూరు శివారులో సర్వే నంబర్‌ 358లో వ్యవసాయ భూమిలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా రియల్‌ వ్యాపారులు ప్లాట్లుగా మార్చారు. ప్లాట్లు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇదంతా బహిరంగంగా జరుగుతున్నా సబంధిత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వ్యవసాయ భూములను నాలా కన్వెన్షన్‌ చేయకుండానే ప్లాట్లుగా చేసి వ్యాపారులు లక్షల రూపాయలు దోచుకుంటున్నారు. సాగు యోగ్యమైన భూములు ప్లాట్లుగా మారుతున్నాయని రైతులు సంబంధిత శాఖ అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా ఫలితం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ విషయమై ఎంపీడీఓ జనార్దన్‌ను అడగగా, తమ దృష్టికి రాలేదని, పరిశీలించి అక్రమంగా వెలిసిన ప్లాట్లను తొలగిస్తామన్నారు.

మా భూములు ఇవ్వం

భూ సర్వేను అడ్డుకున్న రైతులు

హుస్నాబాద్‌: పట్టణ శివారులో 13 ఎల్‌ కాలువ భూ సర్వే కోసం వచ్చిన ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారులను మంగళవారం రైతులు అడ్డుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మా భూములను కాలువలకు ఇవ్వబోమని గతంలో అనేక మార్లు స్పష్టం చేసినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఇక్కడి భూముల్లో గుంట, రెండు గుంటలు ఉన్న నిరుపేదలే ఎక్కువగా ఉన్నారన్నారు. గతంలో కాలువలు తవ్వినా చుక్క నీరు రాలేదన్నారు. నీళ్లు రాక కాలువలు మొత్తం కూడుకుపోయాయని తెలిపారు. రీ డిజైన్‌ చేసే అవకాశం ఉన్నప్పటికీ అధికారులు బలవంతంగా మా భూముల్లో భూ సర్వే చేపడితే ఊరుకోమన్నారు. అనంతరం అధికారులకు వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బాధిత రైతులు మర్యాల రాజిరెడ్డి, పితాంబరం, జాల జ్యోతి కుమార్‌, జాల లక్ష్మయ్య, కిష్టస్వామి, కోటేశ్వర్‌ రావు, హరీష్‌, బొల్లి శ్రీనివాస్‌, గుర్రాల అరుణ, విజయభాస్కర్‌, మల్లికార్జున్‌ రెడ్డి తదితరులు ఉన్నారు.

నాణ్యమైన విద్యుత్‌

అందించాల్సిందే

సబ్‌స్టేషన్‌ ఎదుట రైతుల బైఠాయింపు

మద్దూరు(హుస్నాబాద్‌): మండలంలోని గాగ్గిళ్లాపూర్‌లో వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ అందించాలని రైతులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వచ్చిపోయే కరెంట్‌తో తమ పంట పొలాలు ఎండిపోతున్నాయాని ఆవేదన వ్యక్తం చేశారు. రోజులో 9 గంటల కరెంట్‌ మాత్రమే సరఫరా అవుతోందన్నారు. పగటి వేళలలో మాత్రమే కరెంట్‌ వస్తుండటంతో పొలాల్లో నీరు పారడం లేదన్నారు. ఓవైపు వర్షాలు లేక బోరుబావులు ఎండిపోతుండగా మరోవైపు కరెంట్‌ సమస్యతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. వ్యవసాయానికి సరిపడా నాణ్యమై విద్యుత్‌ను అందించాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించా రు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ బాలరాజు,వార్డు సభ్యులు, రైతులు పాల్గొన్నారు.

కోనోకార్పస్‌ చెట్లు తొలగించాలి

సిద్దిపేటకమాన్‌: మున్సిపాలిటీ పరిధిలో కోనోకార్పస్‌ చెట్లను తొలగించాలని హైకోర్టు ఆదేశించినట్లు సామాజిక కార్యకర్త చక్రధర్‌గౌడ్‌ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కోనోకార్పస్‌ చెట్ల వల్ల ప్రజారోగ్యం, పర్యావరణంపై కలుగుతున్న ప్రతికూల ప్రభావాలను పరిశీలించి వాటిని తొలగించాలని పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. వారు స్పందించకపోవడంతో హైకోర్టును ఆశ్రయించానన్నారు. ఇరుపక్షాల వాదోపవాదనల అనంతరం హైకోర్టు సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో కోనోకార్పస్‌ చెట్లపై వినతిని పరిశీలించి నాలుగు వారాల్లో చట్టప్రకారం చర్యలు పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించినట్లు చక్రధర్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement