యథేచ్ఛగా వ్యాపారం
జనావాసాల మధ్య పొంచిఉన్న ముప్పు
పట్టించుకోని పౌరసరఫరాల శాఖ,
పోలీసులు
సిద్దిపేట పట్టణం కంచీట్ చౌరస్తా సమీపంలోని గ్యాస్ రిపేర్ షాప్‌లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ నుంచి కమర్షియల్ సిలిండర్‌లోకి
రీ ఫిల్లింగ్ చేస్తుండగా ఆదివారం ఒక్కసారిగా పేలింది. దీంతో భారీ శబ్ధం రావడంతో
స్థానికులు భయాందోళనకు గురయ్యారు. షాప్ యజమాని స్వల్పగాయంతో బయట పడ్డారు. దీనిపై ఇంకా పౌరసరఫరాల శాఖ, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఇదొక్కటే కాదు జిల్లాలో
ఇలాంటి రీఫిల్లింగ్ దందాలు యథేచ్ఛగా
జరుగుతున్నాయి. – సాక్షి, సిద్దిపేట
జిల్లాలోని పలు ప్రాంతాల్లో సబ్సిడీ గ్యాస్ రీ ఫిల్లింగ్ దందా జోరుగా సాగుతోంది. జనావాసాల మధ్య అక్రమ దందా నడుస్తుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. డొమెస్టిక్ నుంచి కమర్షియల్, మినీ సిలిండర్లలో రీ ఫిల్లింగ్ చేస్తున్నారు. పౌరసరఫరాల శాఖ అధికారులు, పోలీసులు పట్టించుకోకపోవడంతో దందా జోరుగా సాగుతోంది. ప్రధానంగా జిల్లా కేంద్రమైన సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్, రాయపోల్, దుబ్బాక, చేర్యాలతో, పలు మండలాల్లో ఈ దందా యథేచ్ఛగా సాగుతోంది. పలువురు గ్యాస్ డెలివరీ బాయ్స్ అక్రమార్జనకు తెరలేపి సబ్సిడీ గ్యాస్ పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జిల్లాలో డొమెస్టిక్ 14.5 కిలోల గ్యాస్ సిలిండర్‌కు రూ.1,012, కమర్షియల్ 19కిలోల గ్యాస్ సిలిండర్‌కు రూ.3,096 గ్యాస్ కంపెనీలు ధరలు నిర్ణయించాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ దాదాపు రెండింతలు ధర ఎక్కువగా ఉండటంతో రీ ఫిల్లింగ్ దందాకు తెరలేపుతున్నారు. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్‌ల నుంచి కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌లో రీ ఫిల్లింగ్ చేస్తున్నారు. అలాగే మినీ సిలిండర్లను సైతం డొమెస్టిక్ సిలిండర్ల నుంచే ఫిల్లింగ్ చేసి విక్రయిస్తున్నారు. డొమెస్టిక్ నుంచి చిన్న గ్యాస్ సిలిండర్లలో కేజీకి రూ.200 చొప్పున, అలాగే కమర్షియల్ గ్యాస్ సిలిండర్లలో నింపి రూ.2,500లకు విక్రయిస్తున్నారు.
గ్యాస్‌ను తక్కువగా వినియోగించుకునే వారిని గ్యాస్ డెలివరీ బాయ్స్, ఏజెన్సీ నిర్వాహకులు గుర్తించి వారిచే గ్యాస్ బుక్ చేయిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే సబ్సిడీని మీరే తీసుకోండి అని వినియోగదారులకు ఆఫర్ ఇచ్చి గాలం వేస్తున్నారు. దీంతో వినియోగదారులు వారి వైపు మొగ్గు చూపి గ్యాస్ బుక్ చేస్తున్నారు. ఇలా వచ్చిన గ్యాస్ సిలిండర్‌ను రీ ఫిల్లింగ్, వాణిజ్య అవసరాలకు వినియోగించుకునే వారికి డిమాండ్‌ను బట్టి రూ.2వేల వరకు విక్రయిస్తున్నారు. వీరి అక్రమాలపై నిఘా పెట్టి నియంత్రించాల్సిన పౌరసరఫరాల శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఎవరైనా ఫిర్యాదు చేస్తే నామమాత్రంగా కేసులు నమోదు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రమాదమని తెలిసినా...
జిల్లా వ్యాప్తంగా సుమారు 50కిపైగా అక్రమ సిలిండర్ రీ ఫిల్లింగ్ కేంద్రాలున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ చాలా వరకు వ్యాపార కేంద్రాల్లో అన్ని వస్తువుల మాదిరిగానే చిన్న సిలిండర్ల అమ్మకాలు సాగిస్తున్నారు. సబ్సిడీ సిలిండర్ నుంచి చిన్న సిలిండర్‌లోకి గ్యాస్‌ను రీ ఫిల్లింగ్ చేయడం ప్రమాదకరమైనప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రీఫిల్లింగ్ కేంద్రాలు జనావాసాల మధ్య సాగుతుండడం ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది.
డొమెస్టిక్ నుంచి కమర్షియల్


