తొలి విడతలో 43 కిలో మీటర్లు.. 30 వేల మొక్కలు
● రూ. 3 కోట్ల వ్యయంతో పనులు ● నేడు రామాయంపేటలో మొక్కలను నాటనున్న రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా
సాక్షి, సిద్దిపేట: రహదారికి ఇరువైపులా సాధారణంగా అన్ని రకాల మొక్కలు నాటుతుంటారు.. కానీ 765 డీజీ జాతీయ రహదారిలో ఒకే రకమైన జీడి మామిడి మొక్కలను నాటనున్నారు. దేశంలోనే తొలిసారిగా జాతీయ రహదారి వెంట జీడి మామిడి మొక్కలను పెంచనున్నారు. ఈ బృహత్తర కార్యక్రమం మంగళవారం రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా చేతుల మీదుగా రామాయంపేటలో శ్రీకారం చూట్టనున్నారు. కాలుష్యాన్ని నియంత్రించడంతో పాటు కోతులు, వన్యప్రాణులకు ఆహారంగా అందనుంది.
43 కిలోమీటర్లు..
పెరుగుతున్న జనాభా, నూతనంగా రోడ్ల నిర్మాణంతో అడవులు తరిగిపోతున్నాయి. దీని వల్ల వాతావరణంలో ఉష్ణోగ్రతలు, వాహన కాలుష్యం పెరిగిపోతుంది. దీంతో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్యాన్ని మెరుగుపర్చేందుకు ప్రత్యేక దృష్టిపెట్టింది. జాతీయ రహదారులకు ఇరవైపులా పండ్ల, పూలు, ఔషధ మొక్కలను నాటే కార్యక్రమానికి శ్రీకారం చూట్టింది. మెదక్–సిద్దిపేట–ఎల్కతుర్తి జాతీయ రహదారి (765డీజీ) 134 కిలోమీటర్లు ఉంది. ఇందులో తొలి విడతలో దాదాపు రూ.3కోట్ల వ్యయంతో 43కిలో మీటర్లలో 30వేల జీడి మామిడి మొక్కలను నాటనున్నారు. మొక్కల సంరక్షణ బాధ్యతను ఐదేళ్ల పాటు ఓ సంస్థకు అప్పగించారు. మొక్కలకు నీటిని అందించేందుకు 18 బోర్లను తవ్వించారు. అలాగే మొక్కలకు డ్రిప్‌ను సైతం ఏర్పాటు చేయనున్నారు.
నీడతో పాటు కోతులకు ఆహారం
వచ్చే మూడేళ్లలో నాటే మొక్కలతో జీడీ మామిడి వనంగా రహదారి మారనుంది. అలాగే కోతులకు ఆహారం లభించనుంది. అడవుల్లో తిండి లభించక నివాసాల్లోకి వస్తున్నాయి. ఈ పండ్ల మొక్కలు పెరిగితే నీడతో పాటు కోతులకు ఆహారంగా లభించే అవకాశాలున్నాయి.


