● తొలి వెయ్యి రోజులు చిన్నారికి కీలకం ● డీఆర్‌ఓ నాగరాజమ్మ ● కలెక్టరేట్‌లో జాతీయ పోషణ మాసోత్సవం
సిద్దిపేటరూరల్: చిన్నారుల శారీరక ఎదుగుదల, మానసిక ఆరోగ్యానికి జీవితంలోని తొలి వెయ్యి రోజులు చిన్నారులకు కీలకమని జిల్లా రెవెన్యూ అధికారి నాగరాజమ్మ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్‌లో 9వ జాతీయ పోషణ మాసం జిల్లా స్థాయి కన్వర్జెన్సీ సమావేశం, జిల్లా స్థాయి ప్రత్యేక కార్యక్రమాలను డీడబ్ల్యూఓ శారద ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఆర్‌ఓ మాట్లాడుతూ గర్భాధారణ దశ నుంచి శిశువు తొలి రెండు సంవత్సరాల వరకు సరైన పోషకాహారం, ఆరోగ్య సంరక్షణ, తల్లిపాలు, అవసరమైన వైద్య సేవలు అందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అనంతరం ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ భవ్య మాట్లాడుతూ పిల్లల సంపూర్ణ అభివృద్ధికి సమాన ప్రాధాన్యత కల్పించాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పిల్లలకు అందుతున్న సేవలను వినియోగించుకోవాలని సూచించారు. జిల్లాలోని అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారన్నారు. అనంతరం చిన్నారులకు అందించే పోషకాహార పదార్థాలను బతుకమ్మ, వివిధ రకాలుగా ప్రదర్శించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన కోఆర్డినేటర్‌ను సన్మానించారు. అనంతరం పోషణ పోస్టర్, పోషణ మాస ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ ధనరాజ్, డీఆర్‌డీఏ డీపీఎం ప్రకాశ్, ఐసీడీఎస్ ప్రాజెక్టుల సీడీపీఓలు, పోషన్ అభియాన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


