సిద్దిపేటరూరల్: ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు నమ్మకం కల్పించాల్సిన సీఈసీ.. కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, తక్షణం జ్ఞానేష్ రాజీనామా చేయాలని ఇండియాకూటమి నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం ఇండియా కూటమి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్‌ఐఆర్ పేరుతో కోట్లాది మంది ఓటర్ల పేర్లను జాబితాల నుంచి తొలగించే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఇది ఓటు హక్కుపై నేరుగా దాడి చేయడమేనన్నారు. ఎన్నికల కమిషన్ రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర సంస్థగా పనిచేయాల్సి ఉండగా, కేంద్ర ప్రభుత్వ ఒత్తిడికి లోబడి పనిచేస్తున్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయని నాయకులు విమర్శించారు. ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ కార్యదర్శి మంద పవన్, డీసీసీ అధ్యక్షురాలు తుంకుంటా ఆంక్షారెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, ఇండియా కూటమికి చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


