అధికారులతో కాంగ్రెస్,
బీఆర్‌ఎస్ నేతల పరిశీలనలు
గజ్వేల్: పట్టణంలో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కోటమైసమ్మ రోడ్డు విస్తరణ పనులపై శనివారం కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలు ఏక కాలంలో సమీక్షలు, పరిశీలనలు జరపడం చర్చనీయంశంగా మారింది. ఈ పనులు పెండింగ్‌లో ఉండటం వల్ల పట్టణంలోని పాతబస్తీకి చెందిన వాసులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. రోడ్డు విస్తరణ పనులు సాగకపోవడమేగాకుండా డ్రైనేజీ పనులు సైతం ఆగిపోయాయి. ఈ సమస్య తీవ్రంగా పరిణమించింది. ఇదే క్రమంలో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి స్థానిక మున్సిపల్ కమిషనర్ గణేశ్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ ఈఈ షహనాజ్ బేగం, ఇతర అధికారులతో క్షేత్రస్థాయి పరిశీలనలు జరిపారు. పనుల పెండింగ్‌కు కారణాలను తెలుసుకుని పునఃప్రారంభానికి చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా డ్రైనేజీ పనులను సైతం ప్రారంభించాలన్నారు. ఇదే అంశంపై ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ కార్యాలయంలో ఆర్డీవో చంద్రకళ, ఆర్‌అండ్‌బీ ఈఈ షహనాజ్‌బేగంలతో మున్సిపల్ చైర్‌పర్సన్ గంగిశెట్టి చందన, బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి పనుల తీరుపై సమీక్ష జరిపారు. పనులు పెండింగ్‌లో ఉండటానికి కారణాలను విశ్లేషించారు. కొత్తగా టెండర్లు పిలిచి పనులను పట్టాలెక్కించాలని సూచించారు. క్యాసారం రోడ్డు, రింగురోడ్డు పనులపై కూడా చర్చించారు. ఒకేరోజు ఇరు పార్టీల నేతలు పోటాపోటీగా ఇలా సమీక్షలు జరపడం పట్టణంలో చర్చకు దారితీసింది.


