సాగు భారమే.. | - | Sakshi
Sakshi News home page

సాగు భారమే..

Jun 10 2026 7:38 AM | Updated on Jun 10 2026 7:38 AM

వానాకాలం సీజన్‌కు సన్నద్ధమవుతున్న రైతులకు సాగు భారంగా మారింది. విత్తన సబ్సిడీ గతంలో మాదిరిగానే జనుము, జీలుగలాంటి పచ్చిరొట్ట విత్తనాలకే పరిమితమైంది. యాంత్రీకరణ నామమాత్రంగా మిగిలిపోయింది. మరోవైపు కాంప్లెక్స్‌ ధరల పెరుగుదల కలవరాన్ని సృష్టిస్తోంది.

– గజ్వేల్‌

జిల్లాలో ప్రస్తుత వానాకాలం(ఖరీఫ్‌) సీజన్‌కు సంబంధించి 5.41లక్షల ఎకరాలకుపైగా వివిధ రకాల పంటలు సాగులోకి వస్తాయని వ్యవసాయశాఖ అంచనా వేస్తున్నది. ఇందులో వరి భారీగా 3.85లక్షల ఎకరాలకుపైగా సాగులోకి వచ్చే అవకాశమున్నది. ఇందుకోసం జిల్లాకు వివిధ రకాల వరి విత్తనాలు 60వేల క్వింటాళ్లకుపైగా అవసరముంటాయి. కాగా కంది ఈసారి 7,431 ఎకరాల్లో సాగులోకి వస్తుందని అంచనా ఉండగా.. సుమారు 800 క్వింటాళ్లకుపైగా విత్తనాలు అవసరముంటాయి. మొక్కజొ న్న 28వేల ఎకరాలకుపైగా, మరో 14వేల ఎకరాల్లో పెసర్లు సాగులోకి వచ్చే అవకాశం ఉన్నది.

విత్తనాలకు సబ్సిడీ లేక..

ప్రభుత్వం గతంలో వరి, మొక్కజొన్న, పెసర్లు, మినుమలు, కందులు, పొద్దు తిరుగుడు, శనగలు తదితర విత్తనాలను సబ్సిడీపై అందించేది. వీటిపై రైతులకు 33నుంచి 50శాతం సబ్సిడీ వర్తించేది. ప్రస్తుతం జనుము, జీలుగ లాంటి పచ్చిరొట్ట విత్తనాలకు మాత్రమే సబ్సిడీ కొనసాగుతుండగా, మిగతా వాటికి పూర్తిగా ఎత్తేశారు. జిల్లా రైతులకు ప్రధానంగా 60వేల క్వింటాళ్ల మేర వరి విత్తనాల అవసరముంటాయి. వీటి ధర తక్కువలో తక్కువగా క్వింటాలుకు రూ.6500 రూ.9000 వరకు లెక్కిస్తే రైతులు రూ.39–54కోట్ల మేర విత్తనాలకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఈ విత్తనాలపై కనీసం 25శాతం సబ్సిడీ అందించినా రైతులపై కోట్లల్లో భారం తప్పేది. కానీ సబ్సిడీని పునరుద్ధరించే అవకాశమే కనిపించడం లేదు. ఇదే తరహాలో మొక్కజొన్న, కంది, సోయాబీన్‌, పెసర్లు, మినుములపై భారం తప్పని పరిస్థితి నెలకొన్నది.

కానరాని ‘యాంత్రీకరణ’

వానాకాలం సాగుకు మరో కీలకమైన అంశం యాంత్రీకరణ. ఇది కూడా ఈసారి నామమాత్రంగానే మిగిలిపోయింది. గతంలో ఈ పథకాన్ని పెద్ద ఎత్తున అమలు చేసేవారు. భారీ వరికోత యంత్రాలు, ట్రాక్టర్లు ఇచ్చేవారు. కానీ ప్రస్తు తం కల్టివేటర్‌, రొటోవేటర్లు, తైవాన్‌ స్ప్రేయర్లు, వరి మోపుల మిషన్‌లు అందిస్తున్నారు. ఇవీ కూడా పరిమితంగా అందజేస్తున్నారు. మొత్తానికి వానాకాలం సాగుకు ప్రతిదీ ఈసారి భారంగా మారిందనడంతో సందేహాం లేదు.

పెరిగిన కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు

ఈ సీజన్‌లో యూరియా, డీఏీపీ ధరలు పెరగలేదు. కానీ కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు పెరగడం రైతుల్లో కలవరాన్ని సృష్టిస్తున్నది. జిల్లా రైతులకు 46వేల క్వింటాళ్ల కాంప్లెక్స్‌ ఎరువులు అవసరముంటాయి. కాంప్లెక్స్‌ ఎరువుల్లోని వివిధ రకాలపై గతంలో బస్తాకు రూ.1600–1800 ధర ఉండగా, ప్రస్తుతం 200–500పెరిగింది. సాగులో ఈ ఎరువులు కీలకం. లెక్కన రైతులపై తీవ్రమైన భారం పడుతున్నది.

వానాకాలం సీజన్‌కు రైతుల సన్నద్ధం

విత్తన సబ్సిడీ.. జనుము, జీలుగకే పరిమితం

యాంత్రీకరణ నామమాత్రమే

కాంప్లెక్స్‌ ఎరువుల ధరల

పెరుగుదలతో కలవరం

Advertisement
 
Advertisement
Advertisement