ప్రభుత్వ కళాశాలల్లోనే చేరండి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ కళాశాలల్లోనే చేరండి

Jun 10 2026 7:38 AM | Updated on Jun 10 2026 7:38 AM

చిన్నకోడూరు(సిద్దిపేట): స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల అధ్యాపకులు మంగళవారం చిన్నకోడూరు, పెద్దకోడూరు తదితర గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ తమ పిల్లలను ప్రభుత్వ కళాశాలల్లో చేర్పించాలని కోరారు. ప్రభుత్వ కళాశాలలో ఉచిత పాఠ్య పుస్తకాలు, ఉపకార వేతనాలు, మంచి ల్యాబ్‌లు, గ్రంథాలయం వంటివి అందుబాటులో ఉంటాయన్నారు. ఇంటర్‌ విద్య ప్రాముఖ్యతను తల్లిదండ్రులకు వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలు వివరించారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ కళాశాలలో చేరి నాణ్యమైన విద్య పొందాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌, అధ్యాపకులు ఉన్నారు.

గర్భిణులకు ప్రత్యేక వైద్య సేవలు

డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ధనరాజ్‌

సిద్దిపేటకమాన్‌: ప్రభుత్వాస్పత్రుల్లో గర్భిణులకు ప్రత్యేక వైద్య సేవలందిస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ధనరాజ్‌ తెలిపారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్‌ కార్యక్రమం పదేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా సిద్దిపేట ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో గర్భిణులకు మంగళవారం వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. గర్భిణులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన సలహాలు అందించడంతో పాటు మందులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. రిఫరల్‌ కేసులకు సురక్షిత ప్రసవాల కోసం ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. తల్లి శిశువు ఆరోగ్య పరిరక్షణలో ఈ కార్యక్రమం కీలకపాత్ర పోషిస్తుందన్నారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆయుష్మాన్‌ ఆరోగ్య కేంద్రాల్లో ప్రతి నెలా 9న వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ సేవలను గర్భిణులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సేవల ద్వారా మాతా శిశు మరణాల రేటును తగ్గించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ధాన్యం ట్రాక్టర్లు బారులు

రైస్‌మిల్లు వద్ద రైతుల పడిగాపులు

మద్దూరు(హుస్నాబాద్‌): ధాన్యం బస్తాలను దిగుమతి చేసుకునేందుకు రోజులతరబడి రైస్‌ మిల్లుల వద్ద ట్రాక్టర్లు, లారీలు బారులు తీరాయి. ధాన్యంతోపాటే రైతులు సైతం పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది. మద్దూరు మండలంలోని వల్లంపట్ల రైస్‌మిల్లు వద్ద మూడురోజులుగా వందల సంఖ్యలో ధాన్యం బస్తాల ట్రాక్టర్లు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. రోజుల తరబడి క్యూలైన్‌లలో ఉండటంతో వాహనాల కిరాయి పెరిగి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. దీనికి తోడు వ్యవసాయ పనులు ముందుకు సాగడంలేదని రైతులు తెలిపారు. సుమారు రెండు నెలలు గడిచినా కొనుగోలు ప్రక్రియ పూర్తి కావడం లేదని వాపోతున్నారు. రైస్‌మిల్లుకు తీసుకువచ్చిన వెంటనే ధాన్యాన్ని అన్‌లోడ్‌ చేసుకోవాలని రైతులు కోరారు.

13న మహిళలకు

సైక్లింగ్‌ పోటీలు

అక్కన్నపేట(హుస్నాబాద్‌): అంతక్కపేటలో ఈ నెల 13న మహిళలకు సైక్లింగ్‌ పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు బండారుపల్లి శ్రీనివాసులు, జంగపల్లి వెంకటనర్సయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఖేలో ఇండియా మహిళల సిటీ లీగ్‌ పోటీలు అండర్‌ 16, 18, 20 విభాగాలలో నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. పోటీల్లో పాల్గొనాలనే వారు సొంత సైకిల్‌, హెల్మెట్‌తో హాజరు కావాలని అన్నారు. గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేయనున్నట్లు చెప్పారు. ఆసక్తిగల క్రీడాకారులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని, వివరాలకు 9640760193, 9441925763 నంబర్లను సంప్రదించాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement