సిద్దిపేటరూరల్: జిల్లాలో నిర్దేశించిన రుణ లక్ష్యాలను పూర్తిస్థాయిలో సాధించేందుకు బ్యాంకర్లు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ హైమావతి అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు వ్యవసాయ రుణాలు, ప్రాధాన్యతా రంగ రుణాలు మరింతగా అందించాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సబ్సిడీ ఆధారిత పథకాల రుణాలను అర్హులైన లబ్ధిదారులకు అందించాలన్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లాలోని బ్యాంకులు మొత్తం రూ.9,450 కోట్ల రుణాలు పంపిణీ చేసి 87.60 శాతం లక్ష్యాన్ని సాధించాయన్నారు. అదేవిధంగా 2026–27 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన లక్ష్యాల సాధనలో బ్యాంకర్లు ముందుండాలన్నారు. ముద్ర, విద్య, వ్యవసాయం, ఎంఎస్‌ఎంఈ రంగాల్లో గణనీయమైన సేవలు అందించేలా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలన్నారు. ప్రతి సోమవారం ప్రజావాణికి వచ్చే రైతులకు సత్వర సేవలందించేలా కలెక్టరేట్‌లో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. అంతరించిపోతున్న గొల్లభామ చీరలు నేసే కళను ప్రోత్సహించేలా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. మహిళల ఆర్థిక సాధికారత కోసం వినూత్న వ్యాపార ప్రణాళికలు రూపొందించాలని, టెక్స్‌టైల్స్ పార్క్‌తో పాటు వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు.
రాబోయే రోజుల్లో ఎల్‌నినో ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున రైతులకు తగిన సలహాలు, ఆర్థిక సహకారం అందించి పంట దిగుబడులు తగ్గకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అంతకుముందు ఎల్‌డీఎం హరిబాబు మాట్లాడుతూ 2026–27 సంవత్సరానికి జిల్లాకు మొత్తం రూ.11,829 కోట్ల వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాలు నిర్ణయించినట్లు తెలిపారు. సమావేశం అనంతరం 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక రుణ ప్రణాళికనును కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆర్బీఐ ఏజీఎం హేమలత, యూబీఐ ఆర్‌ఎం మకరంద్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆర్‌ఎంలు, డీసీసీబీ డీజీఎం విశ్వేశ్వర్, నాబార్డ్ డీడీఎం నిఖిల్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, వ్యవసాయ, డీఆర్‌డీఏ అధికారులు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.
బ్యాంకర్లు సమన్వయంతో పనిచేయాలి
కలెక్టర్ హైమావతి
కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి సమీక్ష


