వర్గల్(గజ్వేల్): పర్యావరణ పరిరక్షణ, సుస్థిర విధానాలు పాటించడం ద్వారా వర్గల్ మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల డిగ్రీ కళాశాల అరుదైన ఘనత సొంతం చేసుకుంది. రీసెర్చ్ హైట్స్ ఫౌండేషన్ నిర్వహించిన ఇంపాక్ట్ సమ్మిట్ అండ్ అవార్డ్స్–2026లో సస్టైనబుల్ క్యాంపస్‌గా ప్లాటినం సర్టి ఫికెట్ అందుకుంది. హైదరాబాద్ గచ్చిబౌలి శాంతి సరోవర్ గ్లోబల్‌పీస్ ఆడిటోరియంలో ఇటీవల నిర్వహించిన సదస్సులో వర్గల్ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలకు ‘ప్లాటినం సర్టిఫికెట్’ అందజేసినట్లు మంగళవారం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ భాస్కర్‌రావు పేర్కొన్నారు. సదస్సులో 26 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కళాశాలలు పాల్గొన్నట్లు వివరించారు. జయప్రకాశ్ నారాయణ, టీజీహెచ్‌ఎస్‌ఈ చైర్మన్ వి.బాలకృష్ణారెడ్డి, ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ శోభన్‌బాబు , ప్రముఖ పర్యావరణవేత్త కె.పురుషోత్తంరెడ్డి, నాబార్డ్ చీఫ్‌జనరల్ మేనేజర్ ఉదయభాస్కర్ తదితర ప్రముఖుల సమక్షంలో సర్టిఫికేట్ అందుకోవడం ద్వారా గురుకులం రాష్ట్రస్థాయి ఖ్యాతి గడించిందిన్నారు. ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్–1, 2 ఆఫీసర్లు, విద్యార్థినులతో కలిసి నిర్వహించిన పర్యావరణ హిత కార్యక్రమాలతో ప్లాటినం సర్టిఫికెట్ దక్కిందంటూ వారిని అభినందించారు.
వర్గల్ ‘పూలే’కు ప్లాటినం సర్టిఫికెట్ ప్రదానం


