● ఇబ్బందులు తలెత్తవద్దు ● కలెక్టర్ హైమావతి ● అధికారులతో కలెక్టర్ సమావేశం
సిద్దిపేటరూరల్: యాసంగి సీజన్ వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ చేపట్టి వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో జూమ్ మీటింగ్ నిర్వహించిన కలెక్టర్.. వరి ధాన్యం కొనుగోళ్ల ఏర్పాట్లపై ఆర్డీవోలు, సివిల్ సప్లై, మెప్మా, డీఆర్డీఏ, తహసీల్దార్లు, డీసీఓ, డీఏఓ, డీఎం మార్కెటింగ్ తదితర అధికారులకు సమగ్ర దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అంచనాలకు మించి ధాన్యం వచ్చే అవకాశం ఉన్నందున కొనుగోలు కేంద్రాలను పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలన్నారు. ప్రతి మండలంలో తహసీల్దార్లు, ఎంపిడిఓలు, ఏపిఎం, మహిళ సమాఖ్య ఓపిఓలు, మార్కెటింగ్, అగ్రికల్చర్ అధికారులను సమన్వయం చేసుకొని కొనుగోలు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు ముందస్తు సమావేశాలు నిర్వహించాలన్నారు. జిల్లాలోని 421 కొనుగోలు కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. ప్రతి కేంద్రాన్ని సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో ప్రారంభించాలన్నారు. మార్కెట్ గోదాముల్లో అందుబాటులో ఉన్న ఖాళీ స్థలాన్ని గుర్తించి నిల్వ సదుపాయాలు కల్పించాలని, అవసరమైతే కాటన్ మిల్లులను వినియోగించుకోవాలని డీఎం మార్కెటింగ్‌ను ఆదేశించారు. సమావేశంలో సివిల్ సప్లై అధికారి తనూజ, తదితరులు పాల్గొన్నారు.
టొరెంట్ గ్యాస్ పైప్‌లైన్‌తో గ్యాస్ సరఫరా
ప్రశాంత్‌నగర్(సిద్ధిపేట): టొరెంట్ గ్యాస్ పైప్ లైన్‌తో ప్రభుత్వ ఆస్పత్రులు, రెసిడెన్షియల్ పాఠశాలలకు గ్యాస్ సరఫరా చేయనున్నట్లు కలెక్టర్ హైమావతి తెలిపారు. బుధవారం టొరెంట్ గ్యాస్ ఏజెన్సీ, జిల్లాస్థాయి కమిటీ సభ్యులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ టొరెంట్ గ్యాస్ ఏజెన్సీ వద్ద గ్యాస్ నిల్వలు అధిక మొత్తంలో ఉన్నాయన్నారు. ముందుగా ప్రభుత్వ ఆస్పత్రులు, రెసిడెన్షియల్ విద్యా సంస్థలకు తర్వాత గృహాలకు అందించడానికి చర్యలు చేపడుతున్నామన్నారు. జిల్లా కేంద్రంలో గ్యాస్ పైప్ లైన్ 60కి.మీ పైగా విస్తరించినట్లు తెలిపారు. టోరెంట్ గ్యాస్ పైప్ లైన్ ద్వారా ఎలాంటి ప్రమాదాలు జరగవని పూర్తి సెక్యూరిటీగా ఉంటుందని, వినియోగదారులకు ఏజెన్సీ నిర్వాహకులు అందుబాటులో ఉంటారన్నారు. టొరెంట్ గ్యాస్ సేవలకు 8018426836 నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే మెరుగైన వైద్యం
సిద్దిపేటకమాన్: ప్రభుత్వ మాతా శిశు ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని.. గర్భిణులు తప్పనిసరిగా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే వైద్య సేవలు పొందాలని కలెక్టర్ హైమావతి అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో సేఫ్ మదర్ డే కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ.. హెల్త్ వీక్‌లో భాగంగా రోజువారి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. గర్భిణులు వైద్యుల సూచనలు పాటిస్తూ పౌష్టికాహారం తీసుకోవడం, మానసిక ప్రశాంతత అలవర్చుకోవడం చాలా ముఖ్యమని తెలిపారు. ప్రభుత్వాసుపత్రుల్లో అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయని 7, 8, 9వ నెలల్లో తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అనంతరం ప్రభుత్వాసుపత్రిలోని సైకియాట్రి విభాగం, డి అడిక్షన్ సెంటర్‌ను పరిశీలించారు. కుటుంబ సమస్యలతో డిప్రెషన్‌కు గురై చికిత్స పొందుతున్న పేషెంట్‌తో మాట్లాడి సూచనలు చేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ ధనరాజ్, ఆసుపత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ చందర్, తదితరులు పాల్గొన్నారు.


