న్యూస్‌రీల్
టెన్త్ పరీక్షలు ముగియకముందే హడావుడి
పరీక్షలు రాస్తున్న 15 వేల మంది విద్యార్థులు
మభ్యపెడుతున్న పీఆర్‌ఓలు
ప్రైవేట్ కళాశాలల అడ్మిషన్ల దందా
ఓ వైపు పదో తరగతి పరీక్షలు జరుగుతుండగానే కార్పొరేట్ జూనియర్ కళాశాలల అడ్మిషన్ల దందా ప్రారంభమైంది. హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో ఉన్న కార్పొరేట్ జూనియర్ కళాశాలల్లో చేర్చుకునేందుకు టెన్త్ విద్యార్థులకు గాలం వేస్తున్నారు. ఇందు కోసం పీఆర్‌ఓలుగా ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రైవేట్ కళాశాల ఆధ్యాపకులను నియమించారు. విద్యార్థుల తల్లిదండ్రులకు మెస్సేజ్‌లు, ఫోన్లు చేస్తూ మభ్యపెడుతుండటం గమనార్హం. – సాక్షి, సిద్దిపేట
జిల్లా వ్యాప్తంగా 15,337 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాస్తున్నారు. ప్రతి ఏడాది ఉత్తీర్ణులైన వారిలో దాదాపు 40శాతం వరకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని కార్పొరేట్ కళాశాలల్లోనే అడ్మిషన్లు తీసుకుంటున్నారు. మిగతా 60శాతం మంది స్థానిక ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలు, పాలిటెక్నిక్‌లు, ఐటీఐలలో ప్రవేశాలు పొందుతున్నారు. విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉండాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు కార్పొరేట్ విద్యాసంస్థల వైపు మొగ్గుచూపుతున్నారు.
పీఆర్‌ఓల అవతారం..
ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రైవేట్ ఇంటర్ కళాశాలల అధ్యాపకులు పీఆర్‌ఓల అవతారం ఎత్తుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఒంటి పూట పాఠశాలలు ప్రారంభం కావడంతో మధ్యాహ్నం, సాయంత్రం సమయాల్లో విద్యార్థుల ఇంటింటికీ వెళ్లి మా కళాశాలల్లోనే చేరాలంటూ తల్లిదండ్రులను మభ్యపెడుతున్నారు. మా కళాశాలలో చదువు బాగా చెబుతారని.. ఎంసెట్, ఐఐటీ, జేఈఈ మెయిన్స్, నీట్‌లలో మంచి ర్యాంక్‌లు వస్తున్నాయని ఉచిత సలహాలు ఇస్తున్నారు. కళాశాలలో తనకు తెలిసిన వారు ఉన్నారని, ఫీజులో డిస్కౌంట్ సైతం ఇస్తారని చెబుతుండటం గమనార్హం.


