గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి మంజూరైన రూ.34.10 కోట్లు గడువులోగా రూ.2.90 కోట్లేవినియోగం మిగిలిన రూ.31.20కోట్లపై అయోమయం 509 సీసీ రోడ్లకుగాను 68 మాత్రమే పూర్తి నిధులొచ్చినా వినియోగించుకోలేని తీరుపై సర్వత్రా విమర్శలు
దేవుడు వరమిచ్చినా గుడిలో పూజారి కరుణించని చందంగా తయారైంది గ్రామాల్లో సీసీ రోడ్ల పరిస్థితి. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను సకాలంలో సంబంధింత అధికారులు వినియోగించుకోలేకపోవడంతో మంజూరైన నిధులను వచ్చే ఆర్థిక ఏడాదికి బదలాయిస్తారా? లేక వెనక్కి వెళ్లిపోతాయా అనే అంశంపై అయోమయం నెలకొంది.
–సాక్షిప్రతినిధి, సంగారెడ్డి
గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం కోసం జిల్లాకు గత ఆర్థిక ఏడాది 2025–26లో ఉపాధి హామీ పథకం కింద రూ.34.10 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో ఆయా గ్రామాల్లో 509 సీసీ రోడ్లను నిర్మించాలని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్‌శాఖ నిర్ణయించింది. కానీ వివిధ కారణాలతో ఇందులో 68 సీసీ రోడ్లు మాత్రమే నిర్ణీత గడువులోగా పూర్తి చేయగలిగారు. పూర్తి చేసిన ఈ సీసీ రోడ్ల అంచనా వ్యయం రూ.2.90 కోట్లు మాత్రమే. మిగిలిన 441 సీసీ రోడ్లకు సంబంధించిన రూ.31.20 కోట్ల నిధులు వెనక్కి వెళ్లిపోయే పరిస్థితి నెలకొంది. జిల్లా అభివృద్ధి కోసం మంజూరైన నిధులను సకాలంలో సద్వినియోగం చేసుకోకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ సీసీ రోడ్ల నిర్మాణం కోసం జిల్లాకు మంజూరైన నిధులతో చేపట్టాల్సిన పనులను జిల్లాలోని పలువురు ప్రజాప్రతినిధులు ప్రతిపాదించారు. మంత్రి దామోదర రాజనర్సింహ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న అందోల్ నియోజకవర్గంలో రూ.8.68 కోట్ల అంచనా వ్యయంతో 115 సీసీ రోడ్లను ప్రతిపాదించారు. ఎంపీ సురేశ్‌షెట్కార్ నారాయణఖేడ్ నియోజకవర్గంలోని 35 సీసీ రోడ్లకు రూ.1.75 కోట్లు, జహీరాబాద్‌లో 83 సీసీ రోడ్లకు రూ.6.22 కోట్లు ప్రతిపాదించారు. ఎంపీ రఘునందన్‌రావు సంగారెడ్డి నియోజకవర్గం పరిధిలో 21 సీసీ రోడ్లకు రూ.2.10 కోట్లు ప్రతిపాదించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ 29 సీసీ రోడ్లకు రూ.2 కోట్లు, టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలారెడ్డి రూ.32 సీసీ రోడ్లకు రూ.2 కోట్లు, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు రూ.2 కోట్లు, సెట్విన్ కార్పొరేషన్ స్టేట్ చైర్మన్ గిరిధర్‌రెడ్డి జహీరాబాద్‌లో రూ.2 కోట్లు, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి రూ.71 సీసీ రోడ్లకు రూ.4.కోట్ల మేరకు ప్రతిపాదనలు ఇచ్చారు. నర్సాపూర్ నియోజకవర్గం పరిధిలో ఉన్న హత్నూర మండలంలో స్థానిక ఎమ్మెల్యే సునీతారెడ్డి రూ.40 లక్షలు, స్థానిక కాంగ్రెస్ నాయకులు ఆవుల రాజిరెడ్డి, మదన్‌రెడ్డి 24 సీసీ రోడ్లకు రూ.1.25 కోట్ల పనులను ప్రతిపాదించారు. అయితే మొత్తం రూ.34.10 కోట్ల పనులకు గాను ఆర్థిక సంవత్సరం ముగిసే సరికి రూ.2.90 కోట్లకు మాత్రమే పనులు పూర్తి చేయగలిగారు. ప్రజాప్రతినిధులు ప్రతిపాదించిన పనుల్లో రూ.31.20 కోట్ల నిధులను సకాలంలో వినియోగించుకోలేకపోవడం గమనార్హం.
ఇప్పట్లో అవకాశం లేదు
సీసీ రోడ్ల నిర్మాణానికి సంబంధించి గత ఆర్థిక ఏడాదిలో మంజూరై.. పనులు ప్రారంభించని సీసీ రోడ్ల నిధుల విషయమై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. అయితే మార్చ్ 31 లోపు వినియోగించుకోకపోవడంతో ఇప్పట్లో ఈ సీసీ రోడ్ల నిర్మాణం ప్రారంభించే అవకాశాలు కనిపించడం లేదు. ఇప్పటికే ప్రారంభమై పూర్తయిన సీసీ రోడ్లకు మాత్రం బిల్లులు చెల్లింపు ఉంటుంది.
–జగదీశ్వర్, పర్యవేక్షక ఇంజనీర్,
పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ.


