ప్రైవేట్ కళాశాలల నుంచి విద్యార్థుల తల్లిదండ్రులకు నిత్యం ఫోన్లు, మెస్సేజ్‌ల మోతమోగుతున్నాయి. 20 రోజులుగా ఫోన్‌లు, మెసేజ్‌లు మరీ ఎక్కువయ్యాయి. ముందుగా అడ్మిషన్ తీసుకుంటే రాయితీ అంటూ ఆఫర్లు ఇస్తున్నారు. పాఠశాలల వారీగా విద్యార్థుల సామర్థ్యాలను తెలుసుకుని ఫీజులో రాయితీ ఇస్తామని అడ్మిషన్లు పొందేలా చేస్తున్నారు. గతేడాది ఇంటర్, జేఈఈ మెయిన్స్, ఎంసెట్, ఐఐటీ, నీట్‌లలో వచ్చిన ర్యాంక్‌లను చూపిస్తూ మందస్తుగా అడ్మిషన్ ఫీజు వసూలు చేస్తున్నారు. ఒక్కో విద్యార్థి కళాశాల ఫీజు, హాస్టల్‌తో కలిపి రూ.2 లక్షల నుంచి రూ.4లక్షలు చెబుతున్నట్లు తెలుస్తోంది. తమ ఫోన్ నంబర్లు ప్రైవేట్ కళాశాలల దగ్గరకు ఎలా వెళ్లాయని.. ఫోన్‌లు, మెస్సేజ్‌లతో భరించలేకపోతున్నామని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రైవేటు కళాశాలల అడ్మిషన్ల దందా యథేచ్ఛగా సాగుతున్నా ఇంటర్మీడియెట్ విద్యాశాఖ అధికారులు పట్టనట్లుగా వ్యవహరిస్తుండటంతో పలు విమర్శలకు తావిస్తోంది. అధికారులు స్పందించి అడ్మిషన్ల దందాను ఆరికట్టాలని విద్యార్థి సంఘాల నేతలు కోరుతున్నారు.
షెడ్యూల్ విడుదల కాలేదు
2026–27కు సంబంధించి అడ్మిషన్ల షెడ్యూల్ ఇంకా విడుదల కాలేదు. ఆయా ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలకు చెందిన దళారులు చెప్పే మాయ మాటలను నమ్మి మోసపోవద్దు. అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత గుర్తింపు ఉన్న కళాశాలలోనే అడ్మిషన్లు తీసుకోవాలి.
– రవీందర్ రెడ్డి, డీఐఈఓ, సిద్దిపేట


