బెజ్జంకి(సిద్దిపేట): రాజభవన్‌లో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను బుధవారం ఫుడ్ కమిషన్ సభ్యుడు ఓరుగంటి ఆనంద్ మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేశారు. రాష్ట్రంలో ఆహార భద్రత చట్టం అమలు తీరును వివరించారు.
31 మందికి ఉద్యోగాలు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలకు చెందిన 31 మంది విద్యార్థులకు కోవలెంట్ లేబరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ (సంగారెడ్డి)లో ఉద్యోగాలు సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత తెలిపారు. బుధవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్కిల్ అండ్ నాలెడ్జి సెంటర్, కెరియర్ గైడెన్స్ అండ్ ప్లేస్‌మెంట్ సెల్ ఆధ్వర్యంలో ఉద్యోగాల కోసం క్యాంపస్ ప్లేస్ మెంట్ డ్రైవ్ నిర్వహించారు. 72 మంది విద్యార్థులు పాల్గొనగా, 31 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ అయోధ్య రెడ్డి, టీఎస్‌కేసీ కోఆర్డినేటర్ డాక్టర్ ఉమామహేశ్వరి, రసాయన శాస్త్ర విభాగ అధిపతి డాక్టర్ శ్రీధర్, విద్యార్థులు పాల్గొన్నారు.
జాతీయ సాఫ్ట్‌బాల్
పోటీలకు ఎంపిక
నంగునూరు(సిద్దిపేట): జాతీయ స్థాయి అండర్ 14 సాఫ్ట్‌బాల్ పోటీలకు గట్లమల్యాల ఉన్నత పాఠశాల 8వ తరగతి విద్యార్థిని బానోత్ అర్చన ఎంపికయ్యారు. మహబూబాబాద్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో ఉమ్మడి మెదక్ జిల్లా జట్టు తరుపున ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఈనెల 16 నుంచి ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో రాష్ట్ర జట్టుకు ప్రాతినిథ్యం వహించనున్నట్లు హెచ్‌ఎం రమేశ్, ఫిజికల్ డైరెక్టర్ రాజ్‌కుమార్ తెలిపారు. జాతీయ జట్టుకు ఎంపికై న విద్యార్థిని సర్పంచ్ నరేశ్, ఉపసర్పంచ్ శ్రీనివాస్, హస్టల్ వార్డెన్ మాధవి, ఉపాధ్యాయులు అభినందించారు.
కొమురవెల్లి రైల్వేస్టేషన్ ప్రారంభించండి
కొమురవెల్లి(సిద్దిపేట): పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి రైల్వేస్టేషన్‌ను వెంటనే ప్రారంభించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం పార్టీ నాయకులలో కలిసి రైల్వేస్టేషన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనులు పూర్తయినా కొంత మంది నాయకులు, అధికారుల అసమర్థతతో రైల్వేస్టేష్టన్‌ను ప్రారంభించడం లేదని మండిపడ్డారు. దీంతో మల్లన్న దర్శనం కోసం వచ్చే భక్తులకు తిప్పలు తప్పడంలేదన్నారు. వెంటనే రైల్వేస్టేషన్ ప్రారంభించి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు శెట్టిపల్లి సత్తిరెడ్డి, కొంగరి వెంకట్‌మావో, అరుణ్‌కుమార్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
రేపు ఉచిత వైద్య శిబిరం
సిద్దిపేటకమాన్: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో పట్టణంలో ఈ నెల 10న ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఉమాదేవి తెలిపారు. ఆయుష్ శాఖ సిబ్బందితో కలిసి పట్టణంలో శుక్రవారం ఉదయం ర్యాలీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.
ప్రాథమిక విద్య
బలోపేతానికి కృషి
సిద్దిపేటకమాన్: ప్రాథమిక విద్య బలోపేతమే తమ ప్రధాన లక్ష్యమని ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సంఘం ప్రతినిధులు తెలిపారు. సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించాలని కోరారు. కార్యక్రమంలో పలు మండలాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


