ఇందిరమ్మా.. ఇల్లేదమ్మా?
న్యూస్‌రీల్
26 మండలాల్లో రెండు చోట్లే పూర్తి కొన్ని చోట్ల మధ్యలోనే నిలిచిన పనులు పట్టించుకోని హౌసింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో ‘సాక్షి’ పరిశీలన
బుధవారం శ్రీ 12 శ్రీ నవంబర్ శ్రీ 2025
నత్తనడకన నమూనా ఇళ్లు
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కీలకమైన మోడల్ హౌస్ (ఇందిరమ్మ నమూనా ఇళ్లు) నిర్మాణం పనులు నత్తనడకన సాగుతున్నాయి. నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ప్రతి మండలంలో మోడల్ హౌస్ నిర్మించాలని, దానిని చూసి లబ్ధిదారులు ఇంటిని నిర్మించుకోవాలన్న లక్ష్యంతో చేపట్టారు. కానీ నేటికీ పూర్తి కావడం లేదు. జిల్లా వ్యాప్తంగా 26 మండలాల్లో మోడల్ హౌస్‌ల నిర్మాణానికి పనులు చేపట్టారు. ఇప్పటి వరకు రెండు చోట్ల మాత్రమే అందుబాటులోకి రాగా.. చాలా చోట్ల పునాదులకే పరిమితమయ్యాయి. మరికొన్ని మండలాల్లో పనులే ప్రారంభం కాకపోవడం గమనార్హం. ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో పరిశీలించగా అనేక విషయాలు వెలుగుచూశాయి.
–సాక్షి, సిద్దిపేట
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా అధికారంలోకి రాగానే గూడులేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కోసం ప్రజాపాలనలో దరఖాస్తులను స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా మొదటి విడతలో అర్హులైన 13,054 కుటుంబాలకు ఇళ్లు మంజూరు చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వ స్థలాల్లో రూ.5లక్షల వ్యయంతో ఇందిరమ్మ మోడల్ హౌస్‌ల నిర్మాణం చేపట్టారు. ఇంటిని దాదాపు 45 రోజుల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయినప్పటికీ ఇప్పటి వరకు కోహెడ, హుస్నాబాద్, కొండపాక, అక్కన్నపేట, దౌల్తాబాద్, సిద్దిపేట అర్బన్, నారాయణరావు పేటలలో నిర్మాణాలు సుమారు పూర్తి అయ్యాయి. కానీ కోహెడ, హుస్నాబాద్‌లలో మాత్రమే అందుబాటులోకి తెచ్చారు. మూడు మండలాల్లో బేస్మెంట్, దర్వాజ లెవల్ వరకు నాలుగు మండలాలు, స్లాబ్ లెవల్ వరకు 9 మండలాల పూర్తికాగా, వివిధ అడ్డంకులతో మూడు మండలాల్లో నిర్మాణాలు నిలిచిపోయాయి.
మోడల్ హౌస్ నిర్మాణానికి రూ.5లక్షల నిధులను కేటాయించారు. ఇసుక, ఐరన్, కూలీల పనుల రేట్లు పెరగడంతో మధ్యలోనే పలు చోట్ల పనులు నిలిచిపోయినట్లు సమాచారం. అదనంగా డబ్బులు ఎవరు పెట్టుకోవాలని అధికారులు వెనుకడుగు వేస్తున్నారని తెలుస్తోంది. కొన్ని చోట్ల ఇసుక లభించకపోవడంతో పనులు అర్ధంతంగా నిలిచిపోయాయి.
త్వరలో పూర్తి చేస్తాం
ఇందిరమ్మ మోడల్ హౌస్‌ల నిర్మాణాలు పూర్తి చేస్తాం. వర్షాలు కురవడంతో పనులు మధ్యలో నిలిచిపోయాయి. మరికొన్ని చోట్ల ఇసుక సమస్యతో ఆగిపోయాయి.
–శ్రీనివాస్, ఇన్‌చార్జి హౌసింగ్ పీడీ
ఇందిరమ్మా.. ఇల్లేదమ్మా?
ఇందిరమ్మా.. ఇల్లేదమ్మా?
ఇందిరమ్మా.. ఇల్లేదమ్మా?


