మెదక్‌జోన్: మామూలుగా బ్యాంకులో.. లేదా ప్రైవేట్‌లో గానీ అప్పు తీసుకుంటే వడ్డీ చెల్లిస్తారు. కానీ.. ఇక్కడ మాత్రం తులం బంగారం అప్పుగా తీసుకుంటే ఏడాదికి తులంన్నర బంగారం ఇవ్వాల్సిందే. మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతన్‌శెట్టిపల్లిలో ఇలా బంగారాన్ని అప్పుగా తీసుకొని చెల్లించని ఓ కుటుంబంపై రుణదాతలు దాడి చేశారు. విద్యుత్ స్తంభానికి కట్ఠేసి విచక్షణారహితంగా కొట్టారు. ఈ సంఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాలు.. పోతన్‌శెట్టిపల్లి గ్రామం వడ్డెర కాలనీకి చెందిన బోసు రమణి, రవి దంపతులు. ఇంటి నిర్మాణం కోసం రెండేళ్ల క్రితం అదే కాలనీకి చెందిన ఐదుగురి వద్ద 9 తులాల బంగారం అప్పుగా తీసుకున్నారు. తులం బంగారానికి ఏడాదిలో తులంన్నర ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. తీసుకున్న బంగారాన్ని అమ్మి కొత్తగా ఇల్లు నిర్మించుకున్నారు. అప్పుగా తీసుకున్న బంగారానికి రూ.2 లక్షల వరకు వడ్డీ రూపంలో దశలవారీగా చెల్లించినట్లు బాధితురాలు రమణి తెలిపారు. కాగా, 2023లో తులం బంగారం రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు ఉండగా.. ప్రస్తుతం అది రూ.1.28 లక్షలు పలుకుతోంది. ఒప్పందం ప్రకారం 9 తులాల బంగారానికి గానూ వడ్డీ కింద అదనంగా మరో నాలుగున్నర తులాల బంగారం కలుపుకొని మొత్తం పదమూడున్నర తులాల బంగారం ఇవ్వాల్సి ఉందని రుణదాతలు ఒత్తిడి చేస్తున్నారు.
వారం క్రితం రమణి, రవిలను అప్పు కింద తీసుకున్న బంగారం తిరిగి ఇవ్వాలని వారు అడిగారు. అప్పటి వరకు ఇంట్లోకి రావొద్దని తాళం వేశారు. అయితే.. ఇంటిని అమ్మి బంగారం ఇస్తామని వేడుకున్నా వినలేదు. రవిని విద్యుత్ స్తంభానికి కట్టేసి కొట్టారు. గట్టిగా వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోయారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వారొచ్చి ఇంటి తాళం చెవి ఇప్పించి వెళ్లారు. ఆ మరుసటి రోజు వచ్చి మాపైనే ఫిర్యాదు చేస్తారా అని మళ్లీ రవిని కట్టేసి కొట్టారు. అడ్డొచ్చిన అతని భార్యపై దాడి చేశారు. ఇంటికి తాళం వేసి తమను వెళ్లగొట్టినట్లు బాధితురాలు రమణి పేర్కొంది. తీవ్రంగా గాయపడిన బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొంది మరో గ్రామంలో తలదాచుకున్నారు.
తాళంచెవి ఇప్పించాం: ఎస్‌ఐ
అప్పు కట్టలేదని కొందరు వ్యక్తులు ఇంటికి తాళం వేసి ఇంట్లో నుంచి వెళ్లగొట్టారని వారం క్రితం పోతన్‌శెట్టిపల్లికి చెందిన బోసు రమణి, రవి పోలీస్‌స్టేషన్‌కు వచ్చారని కొల్చారం ఎస్‌ఐ హైమద్ తెలిపారు. గ్రామానికి వెళ్లి తాళం ఇప్పించామన్నారు. సివిల్ కేసులు కోర్టులో చూసుకోవాలని చెప్పామన్నారు.


