ఇదేం భోజనం..?
● కలెక్టర్ హైమావతి ఆగ్రహం ● పాఠశాలల ఆకస్మిక తనిఖీ
ములుగు(గజ్వేల్): మెనూ పాటించకుండా పిల్లలకు ఇదేమి భోజనమని కలెక్టర్ హైమావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం క్షీరసాగర్ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల, వంటిమామిడిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఆమె ఆకస్మికంగా సందర్శించారు. మధ్యాహ్న భోజన ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తప్పనిసరిగా విద్యార్థుల భోజన విషయంలో మెనూ పాటించాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వంటిమామిడి పాఠశాలలో మెనూ పాటించకపోవడంతో ప్రధానోపాధ్యాయుడిపై మండిపడ్డారు. మధ్యాహ్నభోజనం వంటలు రుచికరంగా వండాలని, వంటగది, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వంట సిబ్బందిని, భోజనం విషయంలో ఎలాంటి కొరత లేకుండా చూసుకోవాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. విద్యార్థులతో కొద్దిసేపు మాట్లాడిన కలెక్టర్ సమయం వృధా చేయకుండా లక్ష్యంతో చదువుకోవాలని, సబ్జెక్ట్‌పై పట్టు సాధించాలని సూచించారు. సబ్జెక్టుల విషయంలో ఎటువంటి అనుమానాలున్నా నివృత్తి చేసుకోవాలన్నారు.


