ఏసీబీకి చిక్కిన అవినీతి ఖాకీ
● రూ.50 వేలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత ● ములుగు ఎస్‌ఐ, కానిస్టేబుల్ అరెస్ట్
ములుగు(గజ్వేల్): లంచం తీసుకుంటున్న ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారిద్దరిపై కేసు నమోదు చేసి అరెస్ట్‌చేశారు. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ మంగళవారం రాత్రి మీడియాకు వెల్లడించిన వివరాలిలాఉన్నాయి. తమ సోదరికి కేటాయించిన ఇంటిని వేరే వాళ్లు ఆక్రమించుకున్నారని, వారిని ఖాళీ చేయించేందుకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలని ఓ వ్యక్తి ఈ నెల 5న ఎస్‌ఐ విజయ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశాడు. అలాగే హైకోర్టుకూడా ఇదే విషయమై తహసీల్దార్‌కు ఇల్లు ఖాళీ చేయించేలా డైరెక్షన్ ఇచ్చింది. సరిపడా సిబ్బంది లేరని మూడు, నాలుగుసార్లు ఫిర్యాదుదారులను ఎస్‌ఐ తిప్పించుకున్నారు. చివరకు ఫిర్యాదు దారునితో రూ. లక్ష డిమాండ్ చేస్తూ కేసు, కౌంటర్ కేసును కూడా విచారిస్తానని ఎస్‌ఐ డిమాండ్ చేశాడు. ఈ విషయాన్ని సదరు వ్యక్తి ఏసీబీ అధికారులకు తెలిపారు. ఈ క్రమంలో ఈ నెల 6న ఎస్‌ఐని కలసి రూ.50 వేలు ఇస్తానని చెప్పి ఒప్పందం కుదుర్చుకున్నాడు. మంగళవారం ఎస్‌ఐకి రూ.50 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.


