కాలనీలన్నీ కంపు
జెట్టింగ్ యంత్రం లేక.. మురుగు వీడక
గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో 2020 జూన్ నెలలో ప్రారంభమైన యూజీడీ పనులు పూర్తయ్యాయి. తొలుత రూ.100కోట్లతో ప్రారంభమైన పనులు తర్వాత అంచనాలు పెరిగి.. రూ.155కోట్లతో 130కిలోమీటర్ల మేర పనులు పూర్తి చేశారు. ఇందులో భూగర్భ మురుగునీటి పైప్‌లైన్ వ్యవస్థతో పాటు నాలుగు చోట్ల ఎస్‌టీపీ(సేవరేజీ ట్రీట్‌మెంట్ ప్లాంట్)ల నిర్మాణం చేపట్టారు.
జెట్టింగ్ యంత్రం కోసంబతిమాలుకోవాల్సిందే..
మున్సిపాలిటీ పరిధిలో అతికష్టమ్మీద పనులు పూర్తయి.. యూజీడీ అందుబాటులోకి వచ్చినా.. ఈ వ్యవస్థ నిర్వహణ మాత్రం అధ్వానంగా మారింది. యూజీడీ పనులు లోపభూయిష్టంగా సాగటం వల్ల పలు కాలనీల్లో నిర్మించిన పైపులైన్లకు లీకేజీలు ఏర్పడ్డాయి. మరోవైపు కొన్ని చోట్ల చాంబర్ల ధ్వంసమయ్యాయి. ఫలితంగా జనావాసాల్లోకి యూజీడీ మురుగునీరు పారుతోంది. ఫలితంగా ముక్కుపుటలదిరే దుర్గంధం వెదజల్లుతోంది. ఎక్కడైనా యాజీడీ చాంబర్ల నిండితే.. వాటిని క్లియర్ చేయాల్సిన జెట్టింగ్ యంత్రం ఈ మున్సిపాలిటీకి అందుబాటులో లేదు. రూ.155కోట్లతో పనులు చేపట్టిన కాంట్రాక్ట్ ఏజెన్సీకి రూ.30కోట్లకుపైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ సాకుతో సదరు కాంట్రాక్ట్ ఏజెన్సీ మున్సిపాలిటీకి జెట్టింగ్ యంత్రం సమకూర్చలేదు. ఫలితంగా యూజీడీ నిండినా, లీకేజీల ఏర్పడి క్లియర్ చేయాల్సి వస్తే.. సిద్దిపేట మున్సిపాలిటీ అధికారులను బతిమాలుకొని ఇక్కడికి జెట్టింగ్ మిషన్‌ను తెప్పించుకుంటున్నారు. సమయానికి రాకపోవడంతో పారిశుద్ధ్య సమస్యలతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.
రోజులు గడస్తున్నా.. క్లియర్ చేయడం లేదు
మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్‌లో కొత్తగా బస్టాండ్ నిర్మిస్తున్న వెనుకభాగం కాలనీలో యూజీడీ నిండిపోయి లీకేజీ అవుతున్నా.. క్లియర్ చేసే పరిస్థితి లేదు. సిద్దిపేట యంత్రాన్ని ఇక్కడి మున్సిపల్ అధికారులు కొన్ని రోజులుగా అడుగుతున్నా.. బతిమాలుతున్నా.. ఇప్పటివరకు వారు పంపలేదు. ఫలితంగా వారం రోజులకుపైగా దుర్గంధభరితమైన నీటి లీకేజీ కాలనీవాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. దీనివల్ల రోగాలు వేగంగా ప్రబలుతున్నాయని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపాలిటీకి సొంత జెట్టింగ్ యంత్రం సమకూర్చకపోతే పరిస్థితి దయనీయంగా మారే అవకాశం ఉంది.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం
జెట్టింగ్ మిషన్ లేక యూజీడీ నిర్వహణ ఇబ్బందికరంగా మారింది. యూజీడీ లీకేజీలు, నిండిపోతున్నాయంటూ నిత్యం పట్టణ ప్రజల నుంచి ఫోన్‌కాల్స్ వస్తున్నాయి. సకాలంలో సమస్యను పరిష్కరించకలేకపోతున్నాం. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సొంత జెట్టింగ్ యంత్రాన్ని సమకూర్చాలని కోరుతాం.
– బాలకృష్ణ, గజ్వేల్ ప్రజ్ఞాపూర్
మున్సిపల్ కమిషనర్
రూ.కోట్లు వెచ్చించి యూజీడీ నిర్మించినా..
శుద్ధి యంత్రం కొనుగోలులోతీరని జాప్యం
అధికారుల నిర్లక్ష్యమే కారణం
గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ దుస్థితి
గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో రూ.155 కోట్ల వ్యయంతో యూజీడీ(అండర్ గ్రౌండ్ డ్రైనేజీ) పనులు పూర్తి చేసినా రూ.50లక్షలు వెచ్చించి శుద్ధి యంత్రం సుమకూర్చలేకపోయారు. రూ.30కోట్లకుపైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయనే కారణంతో ఈ యంత్రం కొనుగోలులో జాప్యం నెలకొంది. ఫలితంగా పలు కాలనీల్లో యూజీడీ పైపులైన్లు, చాంబర్లు ధ్వంసమై నిండిపోవడం, లీకేజీలు ఏర్పడి జనావాసాల్లో మురుగు పారుతోంది. ఇలాంటి పరిస్థితి వేళ సిద్దిపేట మున్సిపాలిటీ నుంచి జెట్టింగ్ యంత్రాన్ని బతిమాలి తెప్పించుకోవాల్సి వస్తున్నది. అది సమయానికి రాక.. కాలనీలు కంపుకొడుతున్నాయి.
– గజ్వేల్:


