దీప శోభితం.. వ్రత వైభవం
వర్గల్(గజ్వేల్): నాచగిరి కిక్కిరిసింది. భక్తులతో పోటెత్తింది. వ్రత వైభవంతో అలరారింది. కార్తీక దీప కాంతులతో శోభిల్లింది. శుభకర కార్తీకం, ద్వాదశి ఆదివారం సెలవు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి లక్ష్మీనృసింహుని సన్నిధికి భక్తు లు తరలివచ్చారు. హరిద్రనది వాగులో స్నానం చేశారు. వ్రతమండపంలో సత్యదేవుని వ్రతమాచరించారు. గర్భగుడిలో లక్ష్మీనారసింహులను దర్శించుకున్నారు. అభిషేకం, కల్యాణాది మొక్కులు తీర్చుకున్నారు.
సూర్య బింబాకృతిలో..
రాత్రివేళ కార్తీక సహస్ర దీపోత్సవం నేత్రపర్వం చేసింది. ఆలయ ప్రాంగణంలో సూర్య బింబాకృతిలో కార్తీక దీపాల వరుసలు వెలుగులు విరజిమ్మాయి. సామూహిక దీపోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని సూర్య బింబం ఆకృతిలో దీపాలు వెలిగించారు. స్వామివారి ఆశీస్సులు పొందారు.


