మళ్లీ దంచికొట్టిన వాన
అయ్యో.. పాపం రైతన్న
దుబ్బాక/దుబ్బాకరూరల్: వరుణుడు రైతులపై పగబట్టాడు. ఇప్పటికే భారీ వర్షాలతో చేతికొచ్చిన ధాన్యం తడిసిముద్దవగా.. పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. ఈ బాధల నుంచి రైతు తేరుకోకముందే మళ్లీ ఆదివారం తెల్లవారుజామున, రాత్రి వేళ దుబ్బాక పట్టణంతోపాటు పలు గ్రామాల్లో గంటకు పైగా వాన దంచికొట్టింది. దీంతో మార్కెట్ యార్డులో ధాన్యం మళ్లీ తడిసిముద్దయింది. పెద్దఎత్తున వరదలో కొట్టుకుపోయింది. కష్టమంతా నీటిపాలుకావడంతో రైతులు దిక్కుతోచనిస్థితికి గురయ్యారు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో గంటపాటు ఏకధాటిగా వాన కురవడంతో సుమారు మార్కెట్‌యార్డులో ఉన్న పదివేల క్వింటాళ్ల వరకు ధాన్యం తడిసిముద్దయినట్లు తెలుస్తోంది. ఆరబెట్టుకున్న వడ్లలో భారీగా నీరు నిలవడంతో రోజంతా రైతులు నీళ్లు ఎత్తుపోసేందుకు నరకయాతనపడ్డారు. ధాన్యం మళ్లీ తడిసిపోవంతో మొలకలొచ్చే పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
జాడలేని అధికారులు...
వానలకు తీవ్రంగా నష్టపోయి ఆందోళన చెందుతున్నా కనీసం అధికారులు పట్టించుకోకపోవడంపై రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. మ్యాచర్ పేరిట ఇబ్బందులు పెడుతున్న అధికారులు ఇటువైపు వస్తే తమ బాధలేమిటో తెలుస్తాయని రైతులు మండిపడ్డారు. దుబ్బాక మండలంలోని పలు గ్రామాల్లోనూ వర్షం కురిసింది.
రైతుల ఆందోళన
తడిసిన ధాన్యం కొనాలంటూ డిమాండ్
దుబ్బాకలో ఆదివారం రైతులు ఆందోళనకు దిగారు. తడిసిన ధాన్యం కొనాలంటూ డిమాండ్ చేశారు. వర్షంతో తమ ధాన్యం అంతా తడిసిముద్దయినా పట్టించుకోవడం లేదంటూ పీఏసీఎస్ కు చెందిన కరుణాకర్, ఏఎంసీ సిబ్బంది గణేశ్, పలువురి సిబ్బందిని రైతులు చుట్టుముట్టి ఘెరావ్ చేశారు. ఓ దశలో రైతులు అక్కడికి వచ్చిన సిబ్బందిని మార్కెట్ కార్యాలయంలో ఉంచి తాళం వేసేందుకు ప్రయత్నించారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామంటూ చెప్పడంతో వారిని వదిలిపెట్టారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
తడిసి ముద్దయిన ధాన్యం
దుబ్బాక మార్కెట్‌యార్డు అంతా అతలాకుతలం


