ఇక్కడి పాలు ఇక్కడే విక్రయం | - | Sakshi
Sakshi News home page

ఇక్కడి పాలు ఇక్కడే విక్రయం

Mar 7 2025 9:22 AM | Updated on Mar 7 2025 9:19 AM

సేకరించిన రోజే సరఫరా
● స్వచ్ఛమైన, నాణ్యమైన పాలే లక్ష్యం ● రైతు, వినియోగదారుడు రెండు కళ్లు ● విజయ డెయిరీ ప్రభుత్వ రంగ సంస్థకు చెందినది ● ‘సాక్షి’తో విజయ డెయిరీ డిప్యూటీ డైరెక్టర్‌ శ్రీనివాస్‌

సాక్షి, సిద్దిపేట: జిల్లాలోని పాడి రైతుల నుంచి సేకరించిన పాలను ఇక్కడే విక్రయిస్తున్నామని విజయ డెయిరీ డిప్యూటీ డైరెక్టర్‌(డీడీ) శ్రీనివాస్‌ తెలిపారు. వినియోగదారులకు కల్తీ లేకుండా, స్వచ్ఛమైన, నాణ్యమైన పాలను అందించడమే లక్ష్యమన్నారు. జిల్లా వ్యాప్తంగా 295 పాల సేకరణ కేంద్రాలున్నాయన్నారు. రోజుకు దాదాపు 30వేల లీటర్ల పాలను 7,400 మంది రైతుల నుంచి సేకరిస్తున్నామని చెప్పారు. ‘సాక్షి’తో డీడీ శ్రీనివాస్‌ మాట్లాడుతూ అదే రోజూ పాలను ప్యాకింగ్‌ చేసి ఫ్రెష్‌గా అందిస్తున్నామన్నారు. ఇతర ప్రైవేట్‌ డెయిరీలైతే.. సేకరించిన తర్వాత రెండు రోజుల తరువాత మార్కెట్‌లో పాలను విక్రస్తుంటాయన్నారు. విజయ పాల పేరుతో పలువురు ఇతర ప్రైవేట్‌ డెయిరీలలో ప్యాకింగ్‌ చేసి విక్రస్తున్నారని మా దృష్టికి వచ్చిందని, ఆ పాలతో ప్రభుత్వ రంగ సంస్థ అయిన తెలంగాణ విజయ పాలకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. వినియోగదారులు అందరూ విజయ తెలంగాణ లోగో ఉందో లేదో చూసి కొనుగోలు చేయాలని కోరారు.

సన్న, చిన్నకారు రైతుల నుంచే..

విజయ డెయిరీకి రైతు, వినియోగదారుడు రెండు కళ్లు లాంటి వారన్నారు. దేశంలో ఎక్కడా కొనుగోలు చేయని ధరకు రైతుల దగ్గరి నుంచి పాలను విజయ డెయిరీ కొనుగోలు చేస్తోందన్నారు. సన్న, చిన్నకారు రైతుల నుంచే మా సంస్థ పాలను ఎక్కువగా కొనుగోలు చేస్తోందని శ్రీనివాస్‌ వివరించారు. విజయ తెలంగాణ పాలలో కృత్రిమ పదార్థాలు కలపబోమని, రైతు నుంచి సేకరించిన పాలనే అందిస్తున్నామన్నారు. వినియోగదారులకు ఎలాంటి కల్తీ లేకుండా, స్వచ్ఛమైన నాణ్యమైన పాలను అందించడంలో రాజీపడబోమన్నారు. ప్రభుత్వ హాస్టళ్లలో విజయ తెలంగాణ పాలనే అందజేస్తున్నామని, అలాగే కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయానికి సైతం విజయ నెయ్యినే సరఫరా చేస్తున్నామని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement