కమ్ముకుంటున్న కరువు! | - | Sakshi
Sakshi News home page

కమ్ముకుంటున్న కరువు!

Oct 13 2026 11:43 AM | Updated on Oct 13 2026 11:43 AM

నీటి కుంటల నిర్మాణం

ఎల్‌నినో ప్రభావంతో తగ్గిన వ్యవసాయ పనులు

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: గతేడాది ఇదే నెల (అక్టోబర్‌) రెండో వారంలో జిల్లావ్యాప్తంగా ఉపాధి హామీ పనులకు వెళుతున్న కూలీల హాజరు సంఖ్య రోజుకు కేవలం 1,950 ఉంది. కానీ సోమవారం ఈ పనులకు హాజరైన కూలీల సంఖ్య ఏకంగా 10,394కు చేరింది. గతేడాదితో పోలిస్తే కూలీల హాజరు దాదాపు నాలుగింతలు పెరిగిందంటే కరువు ఛాయలు ఎలా కమ్ముకొస్తున్నాయనేది ఈ సంఖ్యను బట్టి ఇట్టే అర్థం చేసుకోవచ్చు. గతేదాది నవంబర్‌ వరకు వర్షాలు సంవృద్ధిగా కురువడంతో కూలీలంతా వ్యవసాయ పనుల్లో బిజీగా గడిపారు. ఇప్పుడు పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేకపోవడంతో వ్యవసాయ పనులు కూడా సరిగ్గా దొరక్క కూలీలకు ఉపాధి హామీ పనులే దిక్కవుతున్నాయి.

గ్రామంలో సగటున 20 మంది

జిల్లాలో మొత్తం మొత్తం 2.11 లక్షల జాబ్‌కార్డులు.. 3.80 లక్షల మంది కూలీలు ఉన్నారు. ఇందులో రెగ్యులర్‌గా ఉపాధి హామీ పనులకు వెళ్లేవారు (యాక్టివ్‌) 1.93 మంది కూలీలు ఉంటారు. కాగా ఎల్‌నినో ప్రభావంతో గ్రామాల్లో వ్యవసాయ పనులు సరిగ్గా దొరకడం లేదు. దీంతో ఉపాధి కోసం కూలీలకు ఉపాధి హామీ పనులే దిక్కవుతున్నాయి. ప్రస్తుతం ఒక్కో గ్రామంలో సగటున 20 మంది కూలీలు ఈ పనులకు హాజరువుతున్నారు. ఈనెలాఖరు వరకు ఈ సంఖ్య సగటున 60కి చేరుకుంటుందని జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా నారాయణఖేడ్‌ డివిజన్‌ గ్రామాల్లో ఉపాధి హామీ పనులకు వెళ్లే కూలీల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కానీ ఈసారి ఇందుకు భిన్నంగా జహీరాబాద్‌ డివిజన్‌ గ్రామాల్లో కూలీలు ఎక్కువగా ఈ పనులకు హాజరవుతున్నారు.

ప్రణాళికల రూపకల్పనతోనే..

ఏటా కూలీలు డిసెంబర్‌ మాసం వరకు వ్యవసాయ పనుల్లో బిజీగా ఉంటారు. కలుపు తీయడం, పత్తులు ఏరడం వంటి పనులకు కూలీలు దొరడం కష్టంగా ఉంటుంది. వ్యవసాయ పనులన్నీ ముగిశాక ఈ పనులకు వస్తారు. దీంతో అధికారులు రానున్న ఆర్థిక సంవత్సరంలో ఏఏ పనులు చేపట్టాలనే అంశంపై ప్రణాళికను తయారు చేసే వారు. కానీ ఈసారి పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. అక్టోబర్‌లోనే ఉపాధి పనులకు వచ్చే కూలీల సంఖ్య రోజుకు పది వేలు దాటుతోందంటే.. రానున్న రోజుల్లో కరువు తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు.

కరువు ఛాయల నేపథ్యంలో ఉపాధి హామీ పనులకు డిమాండ్‌ ఏర్పడటంతో అధికారులు ఈ పనుల గుర్తింపుపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రధానంగా నీటి కుంటల నిర్మాణం పనులు చేపట్టారు. జిల్లావ్యాప్తంగా 1,017 నీటి కుంటలను ఉపాధి హామీ నిధులతో నిర్మించాలని నిర్ణయించారు. ఇందులో ఇప్పటి వరకు 526 నీటి కుంటల పనులకు అప్రూవల్‌ రాగా, 491 నీటి కుంటల నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. వీటితో పాటు ఇంకుడుగుంతలు, కమ్యునిటీ సోక్‌పీట్‌లు, వాటర్‌ హార్వేస్టింగ్‌ కుంటల నిర్మాణం చేపట్టారు. తద్వారా ఇటు కూలీలకు ఉపాధి హామి పనులు లభించడంతో పాటు, గ్రామాల్లో భూగర్భ జలాలను పెంచేందుకు వీలవుతుందని ప్రభుత్వం వీటి నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.

‘ఉపాధి’ బాట పడుతున్న కూలీలు

రోజుకు పది వేలకు పైగా హాజరు

గతేడాది ఇదే సమయంలో ఈ సంఖ్య 2 వేల లోపే..

ఈనెలాఖరుకు రెట్టింపు అవుతుందని అంచనా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement