● అప్పటి వరకు పోరాటం కొనసాగిస్తాం
● టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
సంగారెడ్డి: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన పోరాటానికి మద్దతుగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సోమవారం సంగారెడ్డి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఐబీ గెస్ట్‌హౌస్ నుంచి పాత బస్టాండ్‌లోని అంబేద్కర్ చౌక్ వరకు సాగిన ఈ ర్యాలీలో నిర్మలా జగ్గారెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈసందర్భంగా ‘జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి’, ‘మోదీ డౌన్ డౌన్’, ‘రాహుల్ గాంధీ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారు. అనంతరం అంబేద్కర్ చౌక్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఓట్ల చోరీ జరుగుతోందని, బీజేపీ ప్రజల ఓటు హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్య పరిరక్షణతో పాటు ఓటు హక్కును కాపాడేందుకు రాహుల్‌గాంధీ వీధుల్లోకి వచ్చి పోరాటం చేస్తున్నారని అన్నారు. ఆయన పోరాటానికి కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు దేశ ప్రజలందరూ మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. తాను ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ, రాహుల్ పోరాటానికి సంగారెడ్డి నుంచే సంఘీభావం ప్రకటించాలనే ఉద్దేశంతో ర్యాలీ నిర్వహించినట్లు వివరించారు.


